Minister Kottu Satyanarayana : విజయవాడ దుర్గగుడిలో మెగా అభిమానుల అత్యుత్సాహంపై దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిల్లో మాట్లాడిన ఆయన... ఎంతటి హీరో అయినా దేవుడు కన్నా ఎక్కువ ఏం కాదన్నారు. ఇందులో పోలీసుల వైఫల్యం ఏంలేదన్నారు. అభిమాన హీరోని చూసిన ఆ సమయంలో ఆలోచన లేకుండా ప్రవర్తించారని మంత్రి అన్నారు. ఆలయంలో జరిగిన అపచారానికి సంప్రోక్షణ చేశారమన్నారు. సినిమా వాళ్లు కూడా అమ్మవారి దర్శనానికి వస్తుంటారన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. జరిగిన అపచారానికి సంప్రోక్షణ చేసి ఉపశమనం కల్పించామని మంత్రి తెలిపారు.
దుర్గగుడిలో అపచారం
గత నెల 27వ తేదీన విజయవాడ దుర్గ గుడికి హీరో రామ్ చరణ్ వచ్చారు. ఈ సమయంలో మెగా అభిమానులు జై చరణ్, జై జై చరణ్ అంటూ నినాదాలు చేశారు. హుండీలు ఎక్కి, చెప్పులతో ఆలయంలోకి ప్రవేశించి, పూల దండలు తెంపిన సంగతి వెలుగుచూసింది. పవిత్ర పుణ్యక్షేత్రమని, అక్కడ క్రమ శిక్షణతో ఉండాలని మరిచిన అభిమానులు తోటి భక్తులకు ఇబ్బందులు కలిగించారు. ఇంద్రకీలాద్రి దుర్గమ్మ గుడిలోకి చరణ్ ఫ్యాన్స్ తోసుకుని వచ్చారు. ఎప్పుడూ లేని విధంగా దుర్గమ్మ గుడి అంతరాలయంలో జై చరణ్ అంటూ నినాదాలు చేశారు. ఈ విషయం వివాదాస్పదం అయింది. అభిమానులు చేసిన పనికి హీరో రామ్ చరణ్ అసహనం వ్యక్తం చేశారు. రామ్ చరణ్ అభిమానులు అలా చొచ్చుకుని వచ్చి అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఆలయ అధికారులు, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించాని భక్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దుర్గగుడిని అపవిత్రం చేశారని ఆరోపించారు.
అభిమానుల అత్యుత్సాహం
"దుర్గగుడి ఘటన నా దృష్టికి వచ్చింది. సినిమా ఫ్యాన్స్ అత్యుత్సాహంలో ఇది జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటాం. ఈ అపచారానికి సంప్రోక్షణ చేశారు. అభిమానులు అధికంగా రావడంతో వారిని అధికారులు, పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. దేవుడి కన్నా ఎవరు గొప్పవాళ్లు కాదు. వచ్చిన అభిమానులు కొంచెం ఆలోచించి వ్యవహరించాలి. ఎంత హీరో అయినా సరే దేవుడి కన్నా గొప్పవాళ్లు కాదు. భక్తుల మనోభావాలు జరగకుండా చూసుకుంటాం. యాదృచ్ఛికంగా జరిగిన ఘటన అది. హీరో రామ్ చరణ్ దర్శనానికి వస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. కానీ అధిక సంఖ్యలో అభిమానాలు వచ్చారు. అందువల్ల కంట్రోల్ చేయడం కష్టమైంది" అని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.