Minister Ambati Rambabu : గుంటూరు వైసీపీ ప్రాంతీయ పార్టీ కార్యాలయంలో జగనన్న నవోత్సవాలు కార్యక్రమం ‌నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు డొక్కా, మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ..  టీడీపీ,జనసేన పార్టీలపై ఒక రేంజ్ లో విమర్శలు చేశారు.  నవమాసాలు, నవరత్నాలు, నవోత్సవాలు ఇలా అన్ని శుభప్రదమైనవన్న మంత్రి అంబటి.... ప్రజల‌‌ ఇబ్బందులను తొలగించేందుకు సీఎం జగన్మోహన్  రెడ్డి ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. వైసీపీ శ్రేణులలో కొత్త ఉత్సాహాన్ని నింపి ఎన్నికల సమరానికి  సిద్ధం చేయడానికి నవోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికలకు వైసీపీ శ్రేణులు  సిద్ధం కావాలన్నారు.   


వాలంటీర్లు ప్రజలకు సంధానకర్తలు 


ఒక ప్రాంత అభివృద్ధి ప్రజల‌‌ జీవన పరిస్థితి, వారి జీవన విధానం, కొనుగోలు శక్తిపై ఆధారపడి ఉంటుందని మంత్రి అంబటి తెలిపారు. ఏదో ఒక ప్రాంతంలో ఇరవై ముప్పై అంతస్థులు కట్టడమే అభివృద్ధా అని ప్రశ్నించారు. ప్రజల‌ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు వాలంటీర్ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వ వ్యవస్థలు, ప్రజలకు సంధానకర్తలుగా వాలంటీర్లు ఉన్నారని అన్నారు. ప్రభుత్వం అందించే పథకాలను నిజమైన లబ్ధిదారులకు అందించే వాలంటీర్ కించపరిచే విధంగా మాట్లాడటం చంద్రబాబుకు తగదని  హితవు పలికారు. వాలంటీర్స్ దొంగలు, పేదలకు దోచి పెడుతున్నారంటూ చంద్రబాబు మాట్లాడటం ఆయన మానసిక పరిస్థితులను తెలియ‌చేస్తుందని ఎద్దేవా చేశారు.  


టీడీపీతో జతకట్టకపోతే పవన్ అసెంబ్లీ గేటు కూడా తాకలేరు 


ఒకవేళ అద్భుతం జరిగి టీడీపీ అధికారంలోకి  వచ్చినా... వైసీపీ పెట్టిన ఏ పథకాన్ని చంద్రబాబు తీయలేరని మంత్రి అంబటి స్పష్టం చేశారు.
జగన్ ను ఓడించడం ఎవరి తరం కాదు రాసుకోండి అని ఛాలెంజ్ చేశారు. జనసేనతో టీడీపీ కలిసి పోటీ చేస్తుందని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అలా చెప్పకుండా ఓట్లు చీలనివ్వను అనటం ప్రజలను మభ్య పెట్టడమే అన్నారు. ఒక ప్రధాన ప్రతిపక్షనేత ఇలా‌మాట్లాడం  కరెక్ట్ కాదన్నారు.  టీడీపీతో జతకట్టకపోతే పవన్ కల్యాణ్  అసెంబ్లీ గేటు కూడా తాకలేరని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పార్టీ పెట్టి ఒక కులాన్ని మరొక కులానికి అమ్ముకునే దౌర్భాగ్యపు పరిస్థితి  దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మా పార్టీలో ఎవ్వరికీ పార్టీ టికెట్ గ్యారెంటీ లేదని తెలిపారు. అధినాయకుని ఆదేశాలు మేరకు గడపగడపకు తిరుగుతున్నామని స్పష్టం చేశారు మంత్రి అంబటి రాంబాబు. 


పవన్ కల్యాణ్ పై ఫైర్ 


జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి ఒక కులం ఓట్లను మరొక కులానికి అమ్ముతున్నారని ఆరోపించారు. ఒంటరిగా పోటీ చేస్తే ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవలేరన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటో పవన్ చెప్పాలని మంత్రి అంబటి డిమాండ్ చేశారు. సీఎం జగన్ ను ఎవరు ఓడించలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2024 లో కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.  ప్రజల్లో నాయకులుగా ఉన్న వాళ్లకే సీఎం జగన్  ఇప్పుడు సీట్లు కేటాయిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు బయటికి వచ్చేవాళ్ళు కానీ అలాంటి పరిస్థితి లేదన్నారు.