Guntur News : గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరులో డయేరియా ప్రబలినట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని గరువు కాలనీలో 14 ఏళ్ల బాలిక బుధవారం సాయంత్రం వాంతులు విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైంది. స్థానిక ఆర్ఎంపీ బాలికకు అందించారు. అయితే చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి బాలిక మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. బాలిక మృతి చెందడంతో తల్లిదండ్రుల తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అదే విధంగా గ్రామంలో మరికొంతమంది వాంతులు విరోచనాలతో బాధపడుతూ పీహెచ్సీలో జాయిన్ అయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో తెనాలి తరలించినట్లు తెలుస్తోంది. దీంతో పంచాయతీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. డయేరియా ప్రబలిన గరువు కాలనీలో తాగునీటి శాంపిల్స్ సేకరించి  ల్యాబ్ కు తరలించారు. గరువు కాలనీలో డయేరియా ప్రబలినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తెనాలి ఆసుపత్రిలో డయారియా లక్షణాలతో ముగ్గురు చేరారు. బాధితులను సబ్ కలెక్టర్ నిధి మీనా పరామర్శించారు. డయేరియాతో 25 మంది ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. 


నీటి శాంపిల్స్ పరీక్షకు 


తెనాలి సబ్ కలెక్టర్ నిధి మీనా మాట్లాడుతూ.. 'కొలకలూరులో వాంతులు విరోచనాలతో బాలిక మృతి చెందింది. దీంతో ఆ ప్రాంతంలో ఆరోగ్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. డివిజినల్ పంచాయతీ అధికారి, జిల్లా ఉపవైద్యాధికారి సమన్వయంతో గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. తెనాలి జిల్లా వైద్యశాలలో ముగ్గురు ఇదే లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. మరో ఇరువురు కొలకలూరు పీహెచ్స్ లో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో నీటి శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం పంపుతున్నాం. అలాగే రోగుల లక్షణాలను విశ్లేషించి కారణాలను నిర్ధారించాల్సి ఉంది. అన్ని రకాలుగా అధికారులు అప్రమత్తం చేశాం. మృతి చెందిన బాలిక వివరాలు కూడా సేకరిస్తాం.' అన్నారు. 


గ్రామంలో సర్వే 


డీఎంహెచ్వో శోభారాణి అధ్యక్షతన కొలకలూరు గ్రామంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు వైద్య సిబ్బంది. శుక్రవారం ఫీల్డ్ లో చేయాల్సిన పనులు బాధితుల వివరాల సేకరణ, ఇంకా ఎంత మందికి వాంతులు విరోచనాలు వంటి సమస్యలు తెలుసుకునేందుకు సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వాంతులు, విరోచనాల లక్షణాలు ఉన్నవారిని ఆసుపత్రిలో చికిత్స అందించాలని వైద్య సిబ్బందికి డీఎంహెచ్వో ఆదేశాలు ఇచ్చారు. పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని వైద్య సిబ్బందిని కోరారు. 


Also Read : AP Weekly Five Days : వారానికి ఐదు రోజులే పని - మరో ఏడాది పొడిగించిన ఏపీ ప్రభుత్వం !


Also Read : GPF Money Moved To Pensions : ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ములు సామాజిక పెన్షన్లకు మళ్లించారా ?