Venkaiah Naidu : పత్రికలు, విద్య, వైద్యం ఓ మిషన్ కోసం నడిచేవని, ఇప్పుడు కమిషన్ కోసం నడుస్తున్నట్లుగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఏపీలో పర్యటిస్తున్న ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గుంటూరులో మిత్రులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో చిరకాల మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులను ఆయన కలిశారు. ఈ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... రాజ్యాంగ పదవుల కంటే జనం మధ్యలో ఉండి పని చేయటం అంటే తనకు ఇష్టమన్నారు. ఉప రాష్ట్రపతిగా ఉన్నా చాలా ఆంక్షలు పక్కన పెట్టి దేశం మొత్తం తిరిగానన్నారు. పదవి నుంచి దిగాక గతంలో మాదిరిగా తనకిష్టమైన ప్రదేశాలకు వెళ్లే అవకాశం వచ్చిందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడుకునే బాధ్యత అందరి పైనా ఉందని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.
చాలా మందికి దక్కాల్సిన గుర్తింపు రాలేదు
"చట్ట సభల స్థాయి తగ్గించడం దేశానికి మంచిది కాదు. శాసన వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ పరిధులు రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. చట్ట సభల్లో ఉండేవారు మరింత బాధ్యతగా ఉండాలి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో ఏం జరుగుతుందని ప్రపంచమంతా చూస్తుంది. చట్ట సభల్లో మాట్లాడే భాష సభ్యత, సంస్కారంతో ఉండాలి. భాష హుందాతనంగా ఉండాలి. దుర్భాషలు వద్దు. రాజ్ పథ్ ను కర్తవ్యపథ్ గా ప్రధాని మార్చారు. సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఆవిష్కరించారు. స్వతంత్రం కోసం పోరాడిన వారిలో సుభాష్ చంద్రబోస్ కూడా ప్రముఖులే. గాంధీ ముందుండి నడిపినా మిగతా వారి పాత్ర తక్కువ కాదు. చాలా మంది పోరాట యోధులకు దక్కాల్సిన గుర్తింపు రాలేదు. "- వెంకయ్య నాయుడు
మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలి
మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలని వెంకయ్య నాయుడు అన్నారు. మన భాషను మనం గౌరవించుకోవాలన్నారు. ఇంట్లో, గుడిలో, బడిలో మాతృభాషలో మాట్లాడుకోవాలని సూచించారు. పరిపాలన తెలుగులో సాగాలని ఆకాంక్షించారు. ఇంగ్లీషు మీడియం వద్దని ఎవరూ చెప్పరని, ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే ఉన్నత స్థాయికి వస్తారనే అభిప్రాయం తప్పు అన్నారు. మాతృభాషలో చదివిన చాలా మంది దేశంలో అత్యున్నత స్థానాలకు ఎదిగారని గుర్తుచేశారు. మాతృభాషలో చదవాలని, ఇంగ్లీషు, హిందీతో పాటు ఇతర భాషలు నేర్చుకోవాలని వెంకయ్య నాయుడు సూచించారు.
రాజ్యాంగ పదవులు నచ్చవు
తనకు రాజ్యాంగ పదవులు నచ్చవంటూ వెంకయ్య నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చట్ట సభలు చాలా ముఖ్యమైనవని, వాటిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చట్టాలు అమలు చేయాల్సిన వారు గాడి తప్పి వ్యవహరిస్తున్నారని వెంకయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంత మంది చేస్తున్న పనులు వల్ల చట్ట సభల స్థాయి తగ్గిపోతుందన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు ప్రతిపక్షాలు హుందాగా ప్రవర్తించాలన్నారు. చట్ట సభల్లో దుర్భాషలాడటం ఒక ట్రెండ్ గా మారిపోయిందని వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : Amaravati Padayatra : అమరావతి రైతులకు రిలీఫ్ - పాదయాత్రకు హైకోర్టు అనుమతి !
Also Read : Lakshmi Parvati: లక్ష్మీ పార్వతికి సుప్రీంలో ఎదురుదెబ్బ! చంద్రబాబుపై పిటిషన్ - అందులో విలువ లేదన్న కోర్టు