Balapur Laddu: బాలాపూర్ గణేష్ అన్నా, అక్కడి లడ్డూ వేలం పాట అన్నా అందరూ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. కరోనా సమయంలో తప్ప 27 ఏళ్లుగా లడ్డూ వేలం పాటలో ప్రత్యేకత చూపిస్తూ.. రాష్ట్ర ప్రజలందరి చూపును తనవైపు తిప్పుకుంటోంది. అయితే ఈ ఏడాది కూడా ఘనంగా వేలంపాట నిర్వహించారు. లడ్డూను ఏకంగా 24 లక్షల 60 వేలు చెల్లించి పొంగులేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు. 1994లో 450 రూపాయలతో ప్రారంభమైన బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలంపాట.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వందలు, వేలు, లక్షల్లోకి చేరిపోయింది. రికార్డు స్థాయిలో లడ్డూ ధర పలుకుతూ... కొన్న వారి కొంగు బంగారంగా నిలుస్తోంది. సుమారు 20 మంది స్థానికులు, స్థానికేతరుల మధ్య జరిగే ఈ వేలం పాట నువ్వానేనా అన్నట్లుగా జరుగుతుంటుంది. 


2000లో లక్షా 5 వేల రూపాయలకు బాలాపూర్ లడ్డూ వేలం


1994వ సంవత్సరం నుంచి 2001 వరకు బాలాపూర్ లడ్డూ వేలల్లోనే పలికింది. 2002లో కందాడ మాధవ రెడ్డి పోటీపడి మరీ లక్షా 5 వేల రూపాయలకు లడ్డూను తన సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత సంవత్సరం నుంచి ధర పెరుగుతూ వస్తోంది. అయితే 2007లో స్థానికుడు రఘునందనచారి 4 లక్షల 15 వేలకు పాట పాడి లడ్డూను దక్కించుకున్నారు. అప్పటి వరకు ఒక్కో లక్ష పెరుగుతూ వచ్చిన లడ్డూ ధర ఏకంగా 2 లక్షలు పెరిగింది. 2015లో బాలాపూర్ లడ్డూ 10 లక్షల దాటి రికార్డు సృష్టించింది. కళ్లెం మదన్ మోహన్ రెడ్డి 10 లక్షల 32 వేలకు లడ్డు దక్కించుకున్నారు. 


2016లో 14 లక్షల 65వేల రూపాయలకు..


2016లో నాలుగు లక్షలు పెరిగింది. ఆ సంవత్సరం మేడ్చల్ కు చెందిన స్కైలాబ్ రెడ్డి 14 లక్షల 65 వేల రూపాయలకు లడ్డూను కైవం చేసుకున్నారు. 2017లో నాగం తిరుపతి రెడ్డి 15 లక్షల 60 వేలకు లడ్డూను దక్కించుకోగా.. 2018లోనూ స్థానికేతరుడు తేరేటి శ్రీనివాస్ గుప్తా 16 లక్షల 60 వేలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. వరుసగా మూడేళ్లు స్థానికేతరులకే బాలాపూర్ గణేష్ లడ్డూ దక్కింది. 2019లో జరిగిన వేలంపాటలో అవకాశం స్థానికులకు దక్కింది. కోలను రాంరెడ్డి 17 లక్షల 60 వేల పాడి బాలాపూర్ లడ్డును దక్కించుకున్నారు. 


వేలంపాట ద్వారా ఇప్పటి వరకు కోటి 44 లక్షల 77 వేలు


2020లో కరోనా కారణంగా లడ్డూ వేలంపాటను రద్దు చేసిన ఉత్సవ సమితి... ఆ లడ్డూను సీఎంకు అందజేశారు. గతేడాది అట్టహాసంగా జరిగిన వేలంపాటలో ఏపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్.. నాదర్గుల్ కు చెందిన మర్రి శశాంక్ రెడ్డితో కలిసి 18 లక్షల 90  వేలకు బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకున్నారు. అయితే ఈ వేలంపాటను మొదట్లో గ్రామాభివృద్ధి కోసమే ప్రారంభించారు. ఇలా ప్రతి ఏటా వేలంపాటలో వచ్చిన డబ్బంతా కలిపి కోటి 44 లక్షల 77 వేల రూపాయలను ఖర్చు చేసినట్లు ఉత్సవ సమితి వెల్లడించింది. ఆ డబ్బునంతటిని గ్రామ అభివృద్ధి కోసమే వాడినట్లు వివరించారు. గ్రామంలోని బొడ్రాయి వద్ద ఈ వేలంపాట జరుగుతుంది. దీన్ని చూసేందుకు వేలాది మంది వస్తుంటారు. అంతే కాదండోయ్ ఇందుకు సంబంధించిన వార్తలను మీడియా ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది.