Supreme Court: వైఎస్ఆర్ సీపీ నాయకురాలు, ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతికి సుప్రీం కోర్టులో (Supreme Court) ఎదురు దెబ్బ తగిలింది. చంద్రబాబు (Chandrababu) ఆస్తులపై విచారణ జరపాలనే పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఒకరి ఆస్తులు తెలుసుకోవడానికి మీరు ఎవరని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు అన్ని విధాలా ఆలోచించాకే ఆ పిటిషన్ కొట్టివేసిందని సుప్రీంకోర్టు తెలిపింది. ఎవరి ఆస్తులు.. ఎవరికి తెలియాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. లక్ష్మీ పార్వతి లేవనెత్తిన అంశంలో విలువ లేదని పిటిషన్ ను సుప్రీంకోర్టు (Supreme Court) డిస్మిస్ చేసింది.


అమిత్ షా- ఎన్టీఆర్ భేటీపై కీలక వ్యాఖ్యలు (Amit Shah - NTR Meet)


గత నెలలో అమిత్ షా - ఎన్టీఆర్ భేటీ అయిన తర్వాత లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో ఆగస్టు 24న ఆమె మీడియాతో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్వాధీనం చేసుకోవాలంటూ లక్ష్మీ పార్వతి సూచించారు. అదే తన కోరిక అని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా వ్యవహరించి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. జూనియర్ ఎన్టీఆర్ అయితే పార్టీని సమర్థంగా నడిపించగలరని మాట్లాడారు.


గత జనవరిలో వింత వ్యాఖ్యలు
Lakshmi Parvati Comments: ఈ ఏడాది జనవరిలో ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద లక్ష్మీపార్వతి వింత కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు తాను ఆయన ఆత్మతో మాట్లాడానని అన్నారు. ‘‘నేను 26 ఏళ్ల తర్వాత ఒక రహస్యం చెబుతున్నా. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఆయన ఆత్మతో మాట్లాడాను. జీవితా రాజశేఖర్ లు నన్ను మద్రాస్ తీసుకెళ్లి ఒక 16 ఏళ్ల అమ్మాయితో మాట్లాడించారు. ఎన్టీఆర్ ఆత్మ ఆ అమ్మాయిలో ప్రవేశించి అనేక విషయాలు నాతో పంచుకుంది’’ అని మాట్లాడారు. ఈ విషయం అప్పుడు హాట్ టాపిక్ అయింది.


ఎర్రబెల్లి వడ్డాణం వ్యాఖ్యలు - లక్ష్మీ పార్వతి కౌంటర్
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Erraballi Dayakar Rao) కొద్ది రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లక్ష్మీ పార్వతిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఆమెకు అప్పట్లో వడ్డాణం కొనిచ్చి ఉంటే మంత్రి పదవి దక్కి ఉండేదని అన్నారు. దానికి లక్ష్మీ పార్వతి కౌంటర్ ఇస్తూ.. 27 ఏళ్ల తర్వాత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇలా ఆరోపించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఎన్టీఆర్ ఎపిసోడ్‌లో వైస్రాయ్‌ హోటల్ ఘటనలో ప్రధాన పాత్ర పోషించిన ఎర్రబెల్లికి (Erraballi Dayakar Rao) చంద్రబాబు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. చంద్రబాబు భార్య కూడా వజ్రాలు, వైఢూర్యాలు, వడ్డాణాలు అడిగారా? అందుకనే మంత్రి పదవి రాలేదా అని అన్నారు. అబద్ధాలు చెప్పడానికి సిగ్గు ఉండాలి అంటూ లక్ష్మీ పార్వతి అన్నారు. ఎన్టీఆర్ కు విశ్వాసఘాతకులుగా ఉన్నవారంతా ఏకం అయ్యారని తెలంగాణ సీఎం కేసీఆర్ కాస్త జాగ్రత్తగా ఉండాలని లక్ష్మీ పార్వతి హితవు పలికారు.