గుంటూరులో బీటెక్ స్టూడెంట్ రమ్య హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. రమ్య హత్య ఘటనపై డీజీపీ మీడియాతో మాట్లాడారు. రమ్య హత్య అత్యంత దురదృష్టకరమన్నారు. సీసీటీవీ దృశ్యాలు ఆధారంగా నిందితుడిని గుర్తించామని డీజీపీ తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో స్థానికుల సమాచారం అత్యంత కీలకమైందని ఆయన తెలిపారు. ఆ సమాచారం ఆధారంగానే నిందితుడ్ని తొందరగా పట్టుకున్నామన్నారు. నిందితుడిని గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్టు చేసినట్లు డీజీపీ ప్రకటించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. సామాజిక మాధ్యమాలలో ఏర్పడే పరిచయాల పట్ల యువత అత్యంత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సూచించారు.
Also Read: Guntur Crime: గుంటూరు బీటెక్ విద్యార్థిని హత్య సీసీ కెమెరా దృశ్యాలు
రాజకీయ కోణం వద్దు
యువతులు, మహిళలపై దాడులకు పాల్పడితే కఠినమైన శిక్షలు తప్పవని డీజీపీ సవాంగ్ హెచ్చరించారు. ఇటువంటి దాడులను రాజకీయ కోణంలో చూడొద్దని కోరారు. ఘటన జరిగిన వెంటనే స్పందించి నిందితుడ్ని అరెస్టు చేసిన గుంటూరు అర్బన్ పోలీసులను డీజీపీ అభినందించారు. మహిళల రక్షణకు అహర్నిశలు శ్రమిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Also Read: Guntur Crime News: గుంటూరులో దారుణం.. బీటెక్ విద్యార్థిని కిరాతకంగా పొడిచి చంపిన యువకుడు
బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యాయత్నం
బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిందితుడిని నరసరావుపేటలోని పమిడిపాడు వద్ద పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులను గమనించిన యువకుడు బ్లేడుతో చేతులు కోసుకున్నాడు. అప్రమత్తమైన పోలీసులు అతడ్ని నరసరావుపేటలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రూ.10 లక్షలు పరిహారం
గుంటూరు బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసుపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. నిందితుడిని కఠినంగా శిక్షపడేలా చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. యువతి హత్య ఘటనపై సీఎం జగన్ అధికారులతో మాట్లాడారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. దిశ చట్టం ప్రకారం వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు. బాధిత కుటుంబాన్ని పరిహారంగా రూ.10 లక్షలు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు.