కశ్మీర్ సోదరుల త్యాగాలను మనం గుర్తు చేసుకోవాలి. స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కోసం పోరాడుతున్న వారికి అండగా నిలవాలని హ్యుందాయ్ పాకిస్తాన్(Hyundai Pakistan) ట్వీట్ చేసింది. దాల్ సరస్సులో ప్రయాణిస్తున్న ఓ పడవ చిత్రాన్ని పోస్టు చేసింది. అందులో కశ్మీర్ అనే అక్షరాలు రెండు దేశాల సరిహద్దుల్లో ఉండే ముళ్ల తీగల్లో ఉంటాయి. ఈ విషయంపై సోషల్ మీడియాలో(Social Media) పెద్ద దుమారం రేగింది. బాయ్ కాట్ హ్యూందాయ్(Boycott Hyundai) అని యాష్ టాగ్ ట్రెండ్ అయింది. తాజాగా గుంటూరులోని హ్యూందాయ్ షో రూమ్ ఎదుట స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో నిరసన చేశారు. భారతదేశంలో వ్యాపారం చేస్తూ హ్యూందాయ్ సంస్థ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని ఆరోపణలు చేశారు. నెటిజన్లు హ్యుందాయ్ తీరును తప్పుబట్టారు. సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నారు.
గుంటూరులో నిరసన
స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో గుంటూరు ఆటోనగర్ లోని హ్యుందాయ్ షోరూం వద్ద బీజేపీ(Bjp) నాయకులు నిరసన చేశారు. కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే అర్థంతో హ్యుందాయ్ పాకిస్తాన్ ట్విట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని ఇండియాలో ఉన్న హ్యుందాయ్ ప్రతినిధులు చెప్పడం కరెక్ట్ కాదన్నారు. కశ్మీర్(Kashmir) భారత్ లో అంతర్భాగమన్న విషయంపై అవగాహన లేని వ్యక్తులు హ్యుందాయ్ కంపెనీ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భారత్ లో హ్యుందాయ్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుందన్నారు. దేశ అంతర్గత వ్యవహారంలో తలదూరిస్తే ఊరకోమని స్పష్టం చేశారు.
నెటిజన్లు ఫైర్
ఏటా ఫిబ్రవరి 5న పాకిస్థాన్ 'కశ్మీర్ సంఘీభావ దినోత్సవం' నిర్వహిస్తుంది. ఇదే సమయంలో హ్యుందాయ్ పాకిస్తాన్ కశ్మీర్‌కు మద్దతుగా యాడ్ ఇవ్వడం భారతీయులకు ఆగ్రహం తెప్పించింది. వారు వెంటనే హ్యుందాయ్ ఇండియా, హ్యుందాయ్ గ్లోబల్‌కు ట్యాగ్ చేస్తూ ప్రశ్నించడం మొదలు పెట్టారు. అందుకు వారు సమాధానం ఇవ్వకుండా నెటిజన్లను బ్లాక్ చేయడం మొదలు పెట్టారు. దాంతో #BoycottHyundai అని ట్రెండ్ చేశారు. ఈ మధ్య కాలంలో కంపెనీ ద్వంద్వ వైఖరి, మనోభావాలు దెబ్బతీసే తీరును నెటిజన్లు సహించడం లేదు. వెంటనే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కొంత కాలం క్రితమే #Boycott Amazon #Cancel Spotify వంటి హ్యాష్ ట్యాగులను ట్రెండ్ చేశారు.
Also Read: కశ్మీర్‌పై పాక్‌కు మద్దతుగా హ్యూందాయ్ యాడ్ - ఫైర్ అయిన నెటిజన్లు!