గోదావరి జిల్లాలు అనురాగం, ఆప్యాయతలకు కేరాఫ్‌ అడ్రస్‌. గోదావరి జిల్లా వాసులు పేరు, కీర్తి  ప్రతిష్టలు కూడా అంతే ఫేమస్. వేటకారంలోనే కాదు మమకారంలోనూ తగ్గేదెలే అంటారు గోదారోళ్లు. ఆషాడంలో వియ్యంకుడు పంపిన సారెకు దిమ్మతిరిగే రేంజ్‌లో శ్రావణ మాసంలో కోడలికి సారె పంపారు. తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు వియ్యంకులు ఎవరికి వారు ఏ మాత్రం తగ్గేదెలే అంటూ ప్రతిష్టాత్మకంగా కానుకలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆషాడ మాసం సందర్భంగా తమ కుమార్తెను పుట్టింటికి తీసుకొచ్చే సమయంలో అల్లుడి కోసం పెళ్లి కుమార్తె తండ్రి టన్నుల్లో చేపలు, రొయ్యలు, బమ్మిడాయిలు, కొర్రమేనులు, పది పొట్టేళ్లు, 50 పందెం పుంజులు వందల రకాల స్వీట్లు ఇంకా అనేక రకాల ఆషాడం సారె లారీల్లో పంపించి ఔరా అనిపించాడు. 




Also Read: భీమవరంలో వరుస పేలుళ్లు.. సీఎం వైఎస్ జగన్ పర్యటనకు ముందు ఘటనలు.. హైటెన్షన్ లో జిల్లా యంత్రాంగం




ఆషాడంలో వియ్యంకుడి సారెకు భారీ రిప్లై


ఇప్పుడు అదే స్థాయిలో తన కోడలి కోసం శ్రావణ మాసం సారెగా ఏకంగా పది వేల కిలోల 20 రకాల స్వీట్లు, పండ్లు, చీరలు ఇతరాత్ర సామాగ్రిని పంపి వియ్యంకుడిని మరిపించారు పెళ్లి కుమారుని తండ్రి. ఇప్పుడు ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పక్క రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశమైంది. తూర్పుగోదావరి జిల్లాలో  రాజమహేంద్రవరం సమీపంలోని కోరుకొండ మండలం గాదరాడ గ్రామానికి చెందిన వ్యాపారి బత్తుల బలరామకృష్ణ పెద్ద కుమార్తె ప్రత్యూషకు పుదుచ్చేరి యానాం పరిధిలోని హోండా షోరూం అధినేత తోట రాజు కుమారుడు పవన్‌ కుమార్‌కు ఈ ఏడాది మే నెలలో వివాహం జరిగింది. కోవిడ్‌ నేపథ్యంలో కేవలం కొద్ది మంది బంధువుల సమక్షంలో నిరాడంబరంగా వివాహం జరిగింది. అత్యంత ఆడంబరంగా వివాహం జరిపించే స్థోమత ఇరువురు వియ్యంకులకు ఉన్నా పరిస్థితులు అనుకూలించక సాదాసీదాగా పెళ్లి జరిగిపోవడంతో... ఆ అసంతృప్తిని తన కుమార్తెకు పంపించే సారె రూపంలో తీర్చుకోవాలనుకున్నారు పెళ్లి కుమార్తె తండ్రి బత్తుల బలరామకృష్ణ. దీంతో అందర్నీ ఆశ్చర్యపరిచే రీతిలో జులై 18న ఆషాడం సారెను యానాం పంపించారు. ఈ విషయం అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. 




Also Read: AP Schools: ఆ పిల్లల చదువులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం... అదే స్కూళ్లల్లోనే కొనసాగించాలని ఆదేశాలు


10 వేల కిలోల స్వీట్లు, 100 అరటి గెలలు...


వియ్యంకుడి ఏమాత్రం తీసిపోకూడదన్న భావనతో శ్రావణ మాసం సందర్భంగా తన కోడలి కోసం తాజాగా కాకినాడ, తాపేశ్వరం కాజాలు, కోనసీమలో ప్రత్యేకంగా దొరికే పూతరేకులు, పాలకోవా తదితర 20 రకాలకుపైబడిన 10 వేల కిలోల స్వీట్లు, 100 అరటి గెలలు, చీరలు, రవికెలు ఇతరాత్ర సామాగ్రి పంపించి ఆశ్చర్చపరిచారు పెళ్లి కుమారుని తండ్రి తోట రాజు. గోదావరి జిల్లాల్లో సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేసే అలవాటు ఉంది. ఇలా కానుకలు ఇచ్చి పుచ్చుకోవడంలో తమ స్థాయిని తెలపాలన్నది కాదు కానీ నవ దంపతులు, ఇరు కుటుంబాల మధ్య ప్రేమాను రాగాలు మరింత బలోపేతమవుతాయని గోదావరి వాసులు అంటున్నారు. ఇక పెళ్లైన తరువాత వచ్చే పెద్ద పండుగలైన వినాయకచవితి, దీపావళి, సంక్రాంతి తదితర పర్వదినాలకు కూడా కానుకలు ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం ఉండగా ఆ రోజున ఇరువురు వియ్యంకులు ఏ స్థాయిలో కానుకలు ఇచ్చి పుచ్చుకుంటారో అనే చర్చ ఇప్పటి నుంచే మొదలైంది.


Also Read: In Pics: మబ్బుల మాటు నుంచి రంగనాయక సాగర్‌ను చూడండి.. ఎంత అందమో.. డ్రోన్ ఫోటోలు