ఏపీలో ధాన్యం రైతులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని అధికార వైఎస్ఆర్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.  ధాన్యం కొనుగోళ్లలో పెద్ద కుంభకోణం జరుగుతోందని... ఉమ్మడి తూ.గో జిల్లాలో 17వేల మంది రైతుల ఆధార్ లింక్ చేయకుండా రైస్ మిల్లుల యజమానులు, అధికారులు మోసం చేశారని ఆయన ఆరోపించారు.  తన వద్ద ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని.. సీఐడీ విచారణ కోరతానని ప్రకటించారు.  సీఐడీ విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. సొంత పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం ఉలిక్కి పడింది. 


సీఎం జగన్ పది రోజుల విదేశీ టూర్ - వైఎస్ఆర్‌సీపీ నేతలకు ఫుల్ హోం వర్క్ !


వెంటే పౌరసరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఇతర ఉన్నతాధికారులు సమీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పిల్లి సుభాష్ మాట్లాడింది స్కాం గురించి కాదన్నారు.  బోస్ ఈకేవైసీలో జరుగుతోన్న జాప్యం గురించి మాత్రమే మాట్లాడారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. పిల్లి సుభాష్ చెప్పిన వివరాల మీద అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నామని వెల్లడించారు. ఎంపీ సూచించిన విధంగా సీబీసీఐడీ విచారణ చేపట్టాల్సినంత అవసరం లేదన్నారు.  


అధికారులు కూడా ఇదే రీతిన స్పందించారు. ధాన్యం కొనుగోళ్లలో కుంభకోణానికి సంబంధించి ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలపై కలెక్టర్లతో మాట్లాడుతున్నామని పౌర సరఫరాల శాఖ ఎండీ వీర పాండియన్ తెలిపారు. ఎంపీ చెప్పినట్లుగా అవతవకలు జరిగే ఆస్కారమే లేదని తేల్చేశారు పౌర సరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్. నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాలు నమోదు చేసి.. మిగతా రెండు ఎకరాలు వేరే వాళ్ల పేర్ల మీద నమోదు చేసే చాన్స్ లేదన్నారు.  తూర్పు గోదావరి జిల్లాలో 68 వేల మంది రైతులుంటే..51 వేల మంది మాత్రమే ఈ కేవైసీ నమోదు చేసుకున్నారని వీరపాండియన్ తెలిపారు. రాష్ట్రం మొత్తం మీద ఇంకా 22 శాతం ఈ కేవైసీ పూర్తి కావాల్సి ఉందని, దాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు.  


అనంత టీడీపీకి అసలైన సమస్య సొంత నేతలే ! చంద్రబాబు చక్కదిద్దగలరా ?


తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని ఎంపీ బోస్ చెప్పినప్పటికీ..అధికారులు మాత్రం అలా జరిగే చాన్స్ లేదన్నారు. మరో వైపు కలెక్టర్‌ను కలిసి ఆధారాలు సమర్పించి సీఐడీ విచారణ కోరుతానని ప్రకటించిన బోస్ ఆ తర్వాత సైలెంటయ్యారు. పార్టీ హైకమాండ్ ఈ అంశంపై ఇక మాట్లాడవద్దని ఆదేశించడంతో ఆయన  ఆగిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది.