Machilipatnam News :   మచిలీపట్నం  ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. సముద్రపు మొగ నుండి 3 కిలోమీటర్ల ప్రధాన కాలువ మార్గంలో 22 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక తొలగింపు చేపట్టారు.  రూ.348 కోట్లతో ఫిషింగ్ హార్బర్ వద్ద జరుగుతున్న పనులను  మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్,  డిప్యూటీ మేయర్ పలువురు కార్పొరేటర్లతో కలిసి పరిశీలించారు. హ మచిలీపట్నం గిలకలదిండిలో సముద్రపు మొగ నుండి 3 కిలోమీటర్ల ప్రధాన కాలువ మార్గంలో 22 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను డ్రెడ్జర్ల సహాయంతో 70 శాతం తవ్వకం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. 


వేసవి కాలం అయినప్పటికి వర్షాలు కారణంగా కొంత మేర పనుల కు ఆటంకం ఏర్పడిందిన,వర్షాలు తగ్గగానే పనులను వేగవంతం చేసేందుకు అవసరం అయినచర్యలు తీసుకోవటం తో పాటుగా,నిర్మాణ పనులను సాంకేతికంగా పూర్తి చేయనున్నట్లు అధికారులు వారికి వివరించారు.  మచిలీపట్నం లో సముద్రంలో చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న  మత్స్యకారుల చిరకాల స్వప్నం మరికొద్ది నెలల్లో అందుబాటులోకి రానుందని వైసీపీ నేతలు ప్రకటించారు.  2009 సంవత్సరం నుండి సముద్రము మొగలో పూడిక తీయించాలని డిమాండ్ ఈ ప్రాంతంలో ఉందన్నారు. కేవలం సముద్రపు పోటు సమయంలోనే చేపల వేటకు వెళ్లే పడవలు తీరానికి వస్తున్నాయని, మొగలో పూడిక సమస్య తీవ్రంగా ఉండడంతో పడవలు సముద్రంలోనికి వెళ్లలేకపోతున్నాయని ఆ సమస్యను పరిష్కరిస్తన్నామన్నారు. 


మచిలీపట్నం లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 చోట్ల ఆధునిక వసతులతో కూడిన ఫిషింగ్ హార్బర్ ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.  ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి, జట్టీల నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా మత్స్యకారులకు రూ. 348 కోట్లతో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటుకు రూపకల్పన జరిగింది.  మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ పరిధిలో 28 ఎకరాలలో 23 భవనాలు నిర్మితమవుతున్నాయి.  అందులో ఆక్షన్ హాల్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, గేర్ కటింగ్, రెస్ట్ హౌస్, పోలీస్ స్టేషన్, పెట్రోల్ బంక్, రోజుకి 3 వేల ఐస్ బ్లాకులను తయారు చేసే ఐస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, క్యాంటీన్, తదితర భవనాలు ఈ ప్రాంగణంలో నిర్మిస్తారు. 


ఇప్పుడు జరుగుతున్న డ్రెడ్జింగ్ పనులు 3.5 మీటర్ల లోతున, 10.50 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి త్రవ్వడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.  దీని వలన రాబోయే 50 ఏళ్ల దాకా మత్స్యకారులకు సముద్రపు మొగలో ఎటువంటి ఇసుక మేట అడ్డంకి లేకుండా చేపలవేటకు సురక్షితంగా వెళ్లేందుకు వీలు పడుతుందని వివరించారు. సముద్ర మొగకు దక్షిణం వైపు గల కృష్ణా నది సిల్ట్ కారణంగా మొగ పూడికకు కారణం అవుతుందని, దీని నివారణకు దక్షిణం వైపు 1240 మీటర్లు, ఉత్తరం వైపు 1150 మీటర్ల పొడవైన గోడ నిర్మించేందుకు చర్యలు చేపట్టారు.  మత్స్యకారులు ఫిషింగ్ చేశాక దిగుమతి కోసం ఒకేసారి 600 బోట్లు నిలబెట్టేందుకు వీలుగా పార్కింగ్ ను 790 మీటర్ల ‘కే’ వాల్ కూడా నిర్మించడం ఇక్కడ ఫిషింగ్ హార్బర్ స్పెషాలిటిగా చెప్పవచ్చు..మత్స్య సంపద ఎగుమతి దిగుమతుల కోసం మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడం, పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయని అదికారులు తెలిపారు.