ఒకప్పుడు పెళ్లి కాని అమ్మాయి ఇంట్లో ఉంటే భారంగా ఆ తల్లితండ్రులు తెగ బాధపడిపోయేవారు. కానీ కాలం మారింది. ఇప్పుడు అబ్బాయిలకు అదే పరిస్థితి నెలకొంది. ఒక సినిమాలో చెప్పినట్లు పెళ్లి కాని ప్రసాదుల్లా మిగిలిపోతున్నారు. ఈ వింత పరిస్థితిపై అబ్బాయిల్ని కన్న తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య పెరిగిపోతుంది. పెళ్లీడు దాటిపోయి వివాహం కాకపోవడంతో బంధువుల పెళ్లిళ్లకు వెళ్లలేక అటు ఎవ్వరితోనూ కలవలేక చాలా మంది ఫీలవుతున్నారట.. తనతోటి చదువుకున్నవారు లేక తనకంటే చిన్నవాళ్లు భార్య పిల్లలతో ఫంక్షన్లకు వస్తుంటే బ్రహ్మచారిలా ఒంటరిగా వెళ్లి.. బంధువులు, స్నేహితులు పిల్లలెంత మంది అని అడుగుతుంటే సమాధానం చెప్పలేని స్థితిలో అసలు వెళ్లకుండా ఉండడమే బెటరని నిర్ణయానికి వస్తున్నారట. తప్పక వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే అంతా సద్దుమణి గాక సింగిల్‌గా వెళ్లి కనిపించేసి వచ్చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని సింగిల్స్ చెబుతున్నారు.  


Also Read: ఏపీ మద్యం దుకాణాల్లో క్యాష్ ఓన్లీ.. పెద్ద స్కాంగా లోక్‌సభలో రఘురామ ఆరోపణ !


అమ్మాయి కుటుంబం గ్రీన్ సిగ్నల్ కోసం 


కొన్ని సామాజిక వర్గాల్లో ఎక్కువగా పెళ్లికాని ప్రసాద్‌ల సంఖ్య మరీ పెరిగిపోతోంది. ఆస్తి, అంతస్తులు ఉన్నా అమ్మాయిలు దొరక్క పెళ్లి అవ్వడంలేదని చెబుతున్నారు. అబ్బాయిల సంఖ్యకు తగిన స్థాయిలో అమ్మాయిలు లేకపోవడంతో అవివాహితులుగా మిగిలిపోవాల్సి వస్తోందని కొందరు యువకులు వాపోతున్నారు. ఎక్కడైనా సంబంధం ఉందని తెలిస్తే వెళ్లి చూసి వచ్చిన తరువాత అమ్మాయిల కుటుంబం నుంచి శుభవార్త ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోందని యువకులు అంటున్నారు. మరొకరు ఏవరైనా మంచి ఉద్యోగం, బాగా స్థిరపడిన యువకుడు, పేరున్న కుటుంబ సంబంధం దొరికితే ఇక ఆ సంబంధంపై ఆశలు వదులుకోవాల్సిందే. పెళ్లి సంబంధాలు కుదుర్చుకుని, ఇంక పెళ్లే తరువాయి అనుకున్న సమయంలోనూ సంబంధాలు చెడిపోతున్నాయి. ఇంతకీ అంతకంటే మంచి సంబంధం అన్న కారణమే ప్రధానంగా కనిపిస్తోంది. అబ్బాయికి బాగా ఆర్థిక స్థోమత ఉన్నా అమ్మాయి తల్లిదండ్రులు సంతృప్తిపడడం లేదట. మంచి ఉద్యోగం, మంచి ఆర్థిక స్థితి, అందం, చందం ఇవన్నీ బేరీజు వేసుకుని అప్పుడు ఆచితూచి ఆలోచించి నిర్ణయానికి వస్తున్నారు. కొంత మంది అమ్మాయికి ఎదురుకట్నం ఇచ్చి, వివాహ ఖర్చులన్నీ తామే భరించడమే కాకుండా అవసరమైతే అమ్మాయి తల్లిదండ్రుల పేరిట కొంత భూమిని కూడా రాసి పెళ్లిళ్లు కుదుర్చుకుంటున్నారు. 


Also Read:  గ్రామ, వార్డు మహిళా కార్యదర్శులు పోలీసులు కారు.. జీవోను ఉపసంహరించుకుటామని హైకోర్టుకు తెలిపిన ఏపీ సర్కార్ !


ఇంతకూ ఎందుకీ పరిస్థితి.. 


చాలా సామాజిక వర్గాల్లో అమ్మాయిల కొరత తీవ్రమవ్వడానికి ప్రధానంగా 1990-96 సంవత్సర కాలంలో చాలా కుటుంబాల్లో పిల్లలు ఒక్కరే చాలు అన్న కారణం కూడా కావొచ్చు అని విశ్లేషకులు చెపుతున్నారు. అమ్మాయి పుట్టినా, అబ్బాయి పుట్టినా ఒక్కరు మాత్రమే చాలు అన్న ఆలోచనతో ఉండడం, గర్భస్థ లింగ నిర్ధారణ చట్టాలు ఆనాటికి ఇప్పుడున్నంతగా పటిష్టం లేకపోవడంతో చాలా మంది అబ్బాయి అయితే గర్భాన్ని ఉంచడం, లేకుంటే అబార్షన్లు చేయించుకోవడం వంటి సంకుచిత కారణాల వల్ల ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందని తేల్చి చెబుతున్నారు. మరి కొంత మంది తొలికాన్పులో అబ్బాయి పుడితే వెంటనే భార్యభర్తల్లో ఎవరో ఒకరు కుటుంబ నియంత్రణ ఆఫరేషన్ చేయించుకోవడం మరో కారణమంటున్నారు.  పెళ్లికూతుళ్ల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో తమ కుమారులు వయస్సు మీద పడుతున్నా ఓ ఇంటోడు కాకపోవడంతో చాలా మంది తల్లిదండ్రులు పదుల సంఖ్యల్లో వివాహ సంబంధాలు చూసి చూసి విసిగి ఇక ఓ నిర్ణయానికి వస్తున్నారట. కులం వేరైనా పరవాలేదండి.. కాస్త మా అబ్బాయికి సంబంధం చూసి ఓ ఇంటోడ్ని చేయండి.. మీ రుణం ఉంచుకోనులేండి.. అంటూ బతిమిలాడుకునే పరిస్థితి తలెత్తిందట. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతీ వెయ్యి మంది అబ్బాయిలకు 993 మంది అమ్మాయిలు ఉన్నారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5(2020) ప్రకారం ఈ నిష్పత్తి పెరిగింది. ప్రతీ వెయ్యి మంది అబ్బాయిలకు 1045 అమ్మాయిలు ఉన్నారు. చెల్డ్ సెక్స్ రేషియో(ఐదేళ్ల లోపు వయసు) మాత్రం ప్రతి వెయ్యి మంది బాలురకు 934 బాలికలు ఉన్నట్లు తేలింది. 


Also Read  : సీడీఎస్‌కే రక్షకుడు..కానీ దురదృష్టం వెంటాడింది..! కన్నీరు పెట్టిస్తున్న సాయితేజ మరణం...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి