టీఎస్ఆర్టీసీని లాభాల బాట పట్టించే దిశగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ వ్యూహాలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ ప్రతిష్ఠను పెంచేందుకు ఆయన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. అదే సమయంలో అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదలడం లేదు. ఇప్పటికే ప్రతి గురువారం ‘బస్ డే’ నిర్వహించాలని సజ్జనార్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇద్దరు ఆడపిల్లలకి జీవితకాల ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు.
ఆర్టీసీ బస్సుల్లో పుట్టిన ఇద్దరు ఆడపిల్లలకు జీవితాంతం ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే అవకాశాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కల్పించారు. నవంబరు 30న నాగర్ కర్నూల్ డిపోకు చెందిన బస్సులో ప్రయాణిస్తున్న సందర్భంగా మహిళ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అంతేకాక, డిసెంబరు 7న ఆసిఫాబాద్ డిపోకు చెందిన బస్సులో ప్రయాణిస్తున్న సందర్భంలో మరో మహిళ సిద్దిపేట సమీపంలో ఆడ పిల్లకు జన్మనిచ్చింది. ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది వారి ప్రసవానికి సహకరించారు. ఆర్టీసీ సిబ్బంది జాగ్రత్తగా బాలింత, పసి పిల్లలను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చినట్టు అధికారులు బుధవారం తెలిపారు.
ఈ అరుదైన ఘటనలు సజ్జనార్ దృష్టికి రాగా.. బస్సులో ప్రయాణిస్తూ ప్రసవించడం అరుదైన ఘటనగా పరిగణించి.. ఆ పుట్టిన శిశువులు జీవితకాలం ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి అనుమతిస్తున్నట్టు సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. అంతేకాక, వారికి ప్రత్యేక బహుమతులు కూడా పంపారు.
నేటి నుంచి ప్రతి గురువారం ‘బస్ డే’
ప్రయాణికులను అకట్టుకునేందుకు టీఎస్ ఆర్టీసీ ప్రతి గురువారం ‘బస్ డే’ కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభించింది. ఆర్టీసీలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, అడ్మినిస్టేట్ ఆఫీసర్లు అందరూ విధిగా ప్రతి గురువారం బస్సులో కార్యాలయాలకు రావాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మంగళవారం అదేశించారు. ఇందులో భాగంగా నేటి నుంచి ‘బస్ డే’ కార్యక్రమం మొదలైంది.
Also Read: Singareni : సింగరేణిలో మూడు రోజుల పాటు ఉత్పత్తి బంద్ .. సంపూర్ణంగా కార్మికుల సమ్మె !
Also Read: ఆ ఆస్పత్రి ఓన్లీ ఫర్ మంకీస్.. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు స్పెషాలిటీ..! ఎక్కడో తెలుసా ?