ప్రణాళికలు వేయడంపై ఉన్న శ్రద్ధ...వాటి అమలు తీరుపై ఉండదు. ఏటా వానాకాలానికి ముందు ప్రభుత్వాధికారులు సమావేశాలు నిర్వహిస్తారు. ఆయా సీజన్లో సమస్యల పరిష్కారానికి ఏం చేయాలో పెద్ద చిట్టా తయారు చేస్తారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితిలో ఎంతమాత్రం మార్పురాదు. చినుకు పడితే చిత్తడిలా తయారయ్యే రోడ్లే అందుకు నిదర్శనం.




పాతదారుల్ని పట్టించుకోరు..కొత్త మార్గాలు వేయరు...చెరువుల్ని తలపించే రోడ్లపై ఈదుకుంటూ వెళ్లాల్సిందే. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉందంటే సరే అనుకోవచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వెక్కిరిస్తున్న రోడ్లే. అసలే అంతంతమాత్రంగా ఉండే రహదారులు...వర్షాలకు మరింత దారుణంగా తయారయ్యాయి. 




శ్రీకాకుళం జిల్లా పాలకొండ - విశాఖపట్నం రహదారి పేరు చెబితే జనం భయాందోళన చెందుతున్నారు.  రాజాం మీదుగా పాలకొండ వరకు రహదారి గుంతలమయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలతో రోడ్డు పరిస్థితి మరింత దారుణంగా మారింది.  రాజాం - పాలకొండ మధ్య ఉన్న 21 కిలోమీటర్ల ప్రయాణానికి రెట్టింపు సమయం పడుతోంది. ఈ రహదారిపై రద్దీ పెరుగుతోందని రోడ్లు భవనాల శాఖ గుర్తించినా అందుకు తగ్గట్లు విస్తరణ పనులు జరగడం లేదు. రాజాం-పాలకొండ రోడ్డుదీ ఇదే దుస్థితి. 




విజయనగరం నుంచి ఒడిసా రాష్ట్రం రాయగడ రోడ్డులో నిత్యం వేలవాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. విజయనగరం నుంచి కూనేరు వరకు ఆరునెలల కిందట ఆర్‌అండ్‌బీ అధికారులు తూతూ మంత్రంగా కొన్ని గోతులు పూడ్చారు. వర్షాలకు మళ్లీ పాతకథే. సాలూరు నుంచి సుంకి మీదుగా ఒడిసాలోని జైపుర్‌ వెళ్లాలంటే ఘాట్‌ రోడ్డే ఆధారం. రక్షణ గోడలు శిథిలమవడంతో  కొండ లోయల్లో వాహనాలు పడిపోతున్నాయి. విజయనగరం నుంచి రాయగడ వెళ్లే మార్గంలో చంపావతి నదిపై గజపతినగరం వద్ద, పారాది వద్ద వంతెన ఉంది. సీతానగరం వద్ద సువర్ణముఖీ నదిపైనా, కోటిపాం వద్ద జంఝావతినదిపైనా వంతెనలున్నాయి. ఇవన్నీ 1933లో బ్రిటిష్‌ పాలకులు నిర్మించినవి.  కూలిపోయే స్థితికి చేరుకున్నా పట్టించుకునే నాథుడు లేడు.




విశాఖ గ్రామీణంలో రహదారులు, భవనాల శాఖ అక్కడక్కడా ప్యాచ్‌ వర్కులు చేసి వదిలేసింది.  జీవీఎంసీ పరిధిలో తగరపువలస నుంచి లంకెలపాలెం వరకూ సుమారు 73 కిలోమీటర్లు జాతీయ రహదారిపై రెండేళ్లుగా మరమ్మతులులేవు. 


 తూర్పుగోదావరి జిల్లాలో చాలా రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఏ గొయ్యి ఎంత లోతు ఉందో తెలియక ప్రమాదాల బారిన పడుతున్నారు.  పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వెళ్లే మార్గంలో 15 కిలోమీటర్లమేర గోతులు తేలాయి.  ఆర్‌అండ్‌బీ శాఖ ఈమధ్యనే రోడ్లకు మరమ్మతులు చేసేందుకు టెండర్లు పిలిచినా ఎలాంటి స్పందన లేదు్.




 కృష్ణాజిల్లాలో రహదారులు వాహనదారులకు నరకాన్ని చూపిస్తున్నాయి. గన్నవరం - నూజివీడు, నూజివీడు - తిరువూరు, కంచికచర్ల - మధిర, నందిగామ - పొక్కునూరు, కౌతవరం - నిడుమోలు - ఐలూరు, మచిలీపట్నం - చిన్నాపురం, నూజివీడు - ఏలూరు, చెవిటికల్లు - వత్సవాయి, తేలప్రోలు - వుయ్యూరు - వల్లూరు రోడ్లు మరమ్మతులు లేకపోవడంతో రోడ్డెక్కాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.




గుంటూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అడుగుకో గుంత.. ఆపై అడపాదడపా కురుస్తున్న వర్షాలతో బురదమయంగా మారిన రోడ్లు భయపెడుతున్నాయి. వాహనదారులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన రహదారులు మృత్యు ఢంకా మోగిస్తున్నాయి. జిల్లాలోని ప్రధాన రహదారులతో పాటు గ్రామీణ రోడ్లు కూడా అధ్వానంగా మారాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న రోడ్లకు ఇటీవల కురుస్తున్న వర్షాలు తోడవడంతో మరింత చిధ్రమై ప్రమాదాలకు కేరాఫ్ అన్నట్టు మారాయి. 




ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రధానమైన జాతీయ రహదారులు మినహాయిస్తే పట్టుమని పది నిమిషాల పాటు ఏఒక్క రోడ్డుపైనా సజావుగా వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. రాష్ట్రప్రభుత్వ పరిధిలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖల రోడ్లు ఎక్కడ చూసిన అధ్వానంగా కనిపిస్తున్నాయి. పలుచోట్ల ప్రధానమైన రహదారులు సైతం గతుకులమయంగా ఉంటుండగా వర్షం పడితే నరకమే.  రాయల సీమ జిల్లాల్లోనూ రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది.  


ఇక ఎటుచూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు తెలంగాణలోనూ రోడ్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికేం లేదు.  ఫించను డబ్బులతో హైదరాబాద్ రోడ్లపై గుంతలు పూడుస్తున్న గంగాధర్ తిలక్ దంపతుల అంశంపై జులై రెండోవారంలో  విచారణ చేపట్టిన హైకోర్టు..జీహెచ్ఎంసీ తీరు సిగ్గుచేటంది. జీహెచ్ఎంసీ అధికారులకు ఇచ్చే జీతం తిలక్ దంపతులకు ఇవ్వడం మేలని అభిప్రాయపడింది. ప్రమాదాల్లో ప్రాణాలు పోతుంటే..వాహనాలు దెబ్బతింటుంటే చూస్తూ కూర్చున్న జీహెచ్ఎంసీకి బడ్జెట్ తగ్గించడం మంచిదని అభిప్రాయపడింది న్యాయస్థానం. 




కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాదు...తెలంగాణ జిల్లా లన్నింటిలోనూ ఇదే పరిస్థితి. వర్షాకాలంలో గుంతలకు, రోడ్లకు పెద్దగా తేడా ఉండదు. వాస్తవానికి మన రహదారుల నాణ్యతే అంతంత మాత్రం. క్రమం తప్పకుండా నిర్వహణ చేయకపోతే... అంతే సంగతులు. అందుకే.. ఏటా వేసవిలో చిన్న చిన్న గోతులకు ప్యాచ్‌ వర్క్‌లు చేస్తారు. భారీగా దెబ్బతిని, వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉంటే ఆ కొంత నిడివిలో మళ్లీ రోడ్డు వేస్తారు. కానీ ఆ పనులు కూడా అంతంత మాత్రంగానే జరగడంతో తెలుగురాష్ట్రాల్లో రోడ్డెక్కాలంటేనే వాహనదారులు వణికిపోతున్నారు.