పోలీస్ బాస్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతం సవాంగ్‌కు ( Gowtam Sawang ) ప్రభుత్వం కీలక పోస్టింగ్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ( APPSC Chariman ) పదవి ఇచ్చింది. ఇది రాజ్యాంగబద్ధమైన పోస్ట్ కావడంతో ఆయన నియామక ఉత్తర్వులను గవర్నర్‌కు పంపినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గవర్నర్ ఆమోద ముద్ర పడిన తర్వాత సవాంగ్ పదవి కాలం ప్రారంభమవుతుంది. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. రాజ్యాంగబద్ద పదవిని ఆయన చేపట్టాలంటే ఐపీఎస్ ( IPS ) హోదాను వదులుకోవాలి. స్వచ్చంద పదవి విరమణ చేయాలి. కానీ సవాంగ్ ఏం ఆలోచిస్తున్నారో స్పష్టత లేదు.
ఎపీపీఎస్సీ ఉద్యోగ నియామకాల సంస్థ. ఇందులో ఐపీఎస్ అధికారుల్ని నియమించడం చాలా అరుదు. విద్యారంగ నిపుణుల్ని ఎక్కువగా నియమిస్తూ ఉంటారు. టీడీపీ ప్రభుత్వం జెఎన్‌టీయూలో ప్రొఫెసర్ అయిన డాక్టర్ ఉదయ్ భాస్కర్‌ను ( Uday Bhasker ) నియమించింది. ఆయన పదవీ కాలం ఆరు నెలల క్రితం ముగిసింది. తర్వాత ఆ పదవిని భర్తీ చేయలేదు. ఇప్పుడు గౌతం సవాంగ్‌కు కేటాయించారు. ఇంకా పదిహేడు నెలల సర్వీస్ ఉండటంతో సవాంగ్ ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్‌ను అందకుంటారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.
ఏపీపీఎస్సీ చైర్మన్, సభ్యులను ప్రభుత్వం నియమించగలదు కానీ తప్పించడం అంత సులభం కాదు. అది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. తొలగింపునకు సహేతుకమైన కారణం ఉంటే.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 316 ప్రకారం రాష్ట్ర గవర్నర్‌కు నివేదించాలి. సదరు వ్యక్తిపై వచ్చిన ఆరోపణలకు పక్కా ఆధారాలు ఉన్నాయని ప్రాధమికంగా గవర్నర్ నిర్ధారించాలి. ఆ తరువాత ఆయన ఆ విషయాన్ని రాష్ట్రపతికి తెలియజేస్తారు. ఆ ఆరోపణలు విచారించదగినవని రాష్ట్రపతి భావిస్తే, అప్పుడు ఆయన సుప్రీం కోర్టుకు ఆ వివరాలు పంపుతారు. సుప్రీంకోర్టు వాటిపై విచారణకు ఆదేశించి.. దానిపై తీర్పు వచ్చే వరకు గవర్నర్ సదరు చైర్మన్, సభ్యులను సస్పెండ్ చేస్తారు. అంతే కానీ బదిలీ చేయడం.. మార్చడం సాధ్యం కాదు.
ప్రస్తుతం ఏపీలో ఉద్యోగ నియామకాలు పరిమితంగా ఉన్నాయి. ఉద్యోగాల క్యాలెండర్‌లో అతి పరిమితంగా ఉద్యోగాలనుప్రకటించారు. ఈ కారణంగా ఏపీపీఎస్సీలో ఉండే పని కూడా తక్కువే. ఇప్పుడు సవాంగ్ ఐపీఎస్ పదవికి రాజీనామా చేస్తే ఎపీపీఎస్సీ చైర్మన్ పోస్ట్ లభిస్తుంది లేకపోతే ఆయనకు వేరే పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారా లేదా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇంత వరకూ ఆయన అలా ధరఖాస్తు చేసుకున్నట్లు స్పష్టత లేదు.