ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా మేడారంలో అమ్మవార్లకు మంత్రి ఎర్రబెల్లి నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించారు. కోరిన కోర్కెలు తీర్చే వన దేవతలను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు సమ్మక్క- సారలమ్మ దీవెనలు ఎల్లప్పుడు ఉండాలని కోరుకున్నారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని సమ్మక్క సారలమ్మను వేడుకున్నానని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.
నేడు (ఫిబ్రవరి 17) సమ్మక్క ఆగమనం
నేడు అటవీ ప్రాంతంలోని చిలకల గుట్టలో ఉన్న సమ్మక్క తల్లిని పూజారులు గద్దెపైకి తీసుకు వస్తారు. సమ్మక్క తల్లిని గద్దెపైకి తీసుకువచ్చే ఈ సమయంలో అధికారులు ప్రభుత్వ లాంఛనాలతో ఆహ్వానం పలుకుతారు. తల్లి రాకకు గౌరవ సూచకంగా జిల్లా ఎస్పీ సహా పోలీసు అధికారులు గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపుతారు. అలా అమ్మకు గౌరవ వందనం సమర్పిస్తారు.
బల్కంపేట ఆలయంలో కవిత, తలసాని పూజలు
సీఎం పుట్టిన రోజును పురస్కరించుకొని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. సీఎం పది కాలాల పాటు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లుగా మంత్రి తలసాని తెలిపారు.
మరోవైపు, కేసీఆర్ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ కీలక నేతలు సహా కార్యకర్తలు పలు సహాయక కార్యక్రమాలు చేపట్టారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని గిఫ్ట్ - ఏ స్మైల్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లో 10 మంది దివ్యాంగులకు మూడు చక్రాల ఎలక్ట్రిక్ సైకిళ్లను తానే స్వయంగా పంపిణీ చేశారు. ఉమ్మడి ఏపీ సమయంలో నెలకు రూ.500 ఉన్న దివ్యాంగుల పింఛన్లను సీఎం కేసీఆర్ రూ.3,016పెంచారని, దీంతో పాటు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ దివ్యాంగుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఎంతో పాటుపడుతున్నారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.