Ganta Meet Chiru :  తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చిరంజీవితో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసంలో వీరిద్దరి సమావేశం జరిగింది.  గాడ్‌ ఫాదర్‌ మంచి విజయాన్ని అందుకున్నందుకే మెగాస్టార్‌ను అభినందించడానికే సమావేశమయ్యారని గంటా అనుచరులు చెబుతున్నారు. కానీ తాజా రాజకీయ అంశాలు కూడా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలోనే పవన్‌కు సపోర్ట్‌గా చిరంజీవి మాట్లాడారు. అవసరమైతే తాను కూడా పవన్‌కు మద్దతుగా నిలబడతానన్నారు. ఈ కాక ఇంకా చల్లారక ముందే చిరంజీవి, గంటా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 


పార్టీలు మారినా  చిరంజీవితో స్నేహం కొనసాగిస్తున్న గంటా శ్రీనివాస్


ప్రజారాజ్యం పార్టీలో కీలక పాత్ర పోషించిన గంటా శ్రీనివాసరావు.. ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో  కాంగ్రెస్ నేత అయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో మంత్రిగా ఉన్నారు.. టీడీపీ హయాంలోనూ మంత్రిగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ  పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. అయితే మొదటి నుంచి  రాజకీయాలకు అతీతంగా చిరంజీవితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో యాక్టివ్‌గా లేకపోయినప్పటికీ పలుమార్లు చిరంజీవితో కనిపించారు.ఇప్పుడు మరోసారి  చిరంజీవితో భేటీ అయ్యారు. 


టీడీపీతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్న గంటా 


టీడీపీ తరఫున 2019 ఎన్నికల్లో గెలిచిన గంటా శ్రీనివాస రావు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆ మధ్య స్టీల్‌ప్లాంట్ ఉద్యమం పాల్గొన్న ఆయన.. తన పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా కూడా సమర్పించారు. అప్పటి నుంచి శాసన సభకు కూడా వెళ్లడం లేదు. ఈ మధ్య కాలంలో వికేంద్రీకరణ, అమరావతి ఉద్యమంపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తున్నా గంటా మాత్రం రియాక్ట్ కాలేదు. టీడీపీలో అంత యాక్టివ్‌గా లేని గంటా ఇప్పుడు చిరంజీవితో సమావేశం కావడం రాజకీయంగా చర్చ మొదలైంది.


భవిష్యత్‌లో ఎప్పుడైనా  జనసేనకు సపోర్ట్ చేయవచ్చన్న చిరంజీవి


చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకుని చాలా కాలం అయింది. తాను మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానన్నారు. తన సోదరుడికి సపోర్ట్ చేసేందుకే సైలెంట్‌గా ఉన్నానని ప్రకటించారు. అయితే గంటా శ్రీనివాసరావు మాత్రం పూర్తిగా రాజకీయ నేత. అందుకే వీరి భేటీ విషయంలో రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. భవిష్యత్‌లో తాను జనసేనకు సపోర్ట్ చేస్తానేమోనని సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పేర్కొన్నారు. అందుకే ఏ రకాజకీయ నేతతో అయినా చిరంజీవి భేటీ అయితే... ఆ సమావేశంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.  


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టిక్కెట్లు ప్రకటించారు. టీడీపీ తరపున ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోయినా ఆయనకూ టిక్కెట్ ఖరారు చేశారు.  ఇటీవలే గంటా పార్టీ పరంగా కొన్ని కార్యక్రమాలను నియోజకవర్గాల్లో చేపడుతున్నారు. 


వికేంద్రీకరణ మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా- జేఏసీకి లెటర్ అందజేత