గన్నవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తారా స్థాయికి చేరాయి. దీంతో ఆ పార్టీని వీడేందుకు యార్లగడ్డ వెంకటరావు రెడీ అయ్యారని సన్నిహితులు చెబుతున్నారు. పార్టీ వర్గాల్లో కూడాా ఎప్పటి నుంోచ ప్రచారం జరుగుతోంది.
గన్నవరం పంచాయితీకి చెక్...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గన్నవరం నియోజకవర్గంలో ఇప్పటికే తారా స్థాయికి విభేదాలు చేరాయి. తెలుగు దేశం పార్టీ నుంచి గెలుపొందిన వల్లభనేని వంశీ మోహన్ ఎన్నికల తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. జగన్ వెంట నడవాలని నిర్ణయించుకున్నారు.
అప్పటి నుంచి గన్నవరం వైఎస్‌ఆర్‌సీపీలో రాజకీయ రగడ రాజుకుంది. వంశీ రాకను ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన నేతలు వ్యతిరేకించారు. ఈ వ్యవహరం ముఖ్యమంత్రి జగన్ వద్ద కూడా పంచాయితీ నడిచింది. అయినా వివాదానికి తెర పడలేదు. అధినాయకత్వం కూడా వంశీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న నాయకులను లైట్ తీసుకున్నారు.
అధినాయకత్వం వంశీని వెనకేసుకొస్తున్నందున ఆయన్ని వ్యతిరేకించిన యార్లగడ్డ వెంకటరావు తెలుగు దేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో పాల్గొన టీడీపీ కండువా కప్పుకోవాలని చూస్తున్నారట. గన్నవరం నియోజకవర్గంలోకి త్వరలోనే యువగళం పాదయాత్ర ఎంట్రీ ఇస్తుంది. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకటరావు సైకిల్ ఎక్కి గెలుపు జెండా ఎగరేయాలని చూస్తున్నారు.
ఆ ఇద్దరి చేతులు కలిపిన సీఎం...
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విభేదాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. బహిరంగంగానే వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకటరావు చేతులు కలిపి కలసి పని చేయాలని జగన్ నచ్చ చెప్పారు. అయినా యార్లగడ్డ వెంకటరావు, వంశీతో కలసి పని చేసేందుకు ససేమిరా అన్నారు. నియోజకవర్గంలో ఉన్న డాక్టర్ దుట్టా రామచంద్రరావుతో కలసి వంశీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు.
ఇవన్నీ పట్టించుకోకుండా ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున సీటు ఇచ్చేందుకు అంగీకరించారు. దీనిపై బహిరంగంగానే దుట్టా, యార్ల అసహనం వ్యక్తం చేశారు. అయినా ఈ ఇద్దరు నేతలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన వెంకటరావు..
2019ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున యార్లగడ్డ వెంకటరావు తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న వంశీకి వ్యతిరేకంగా పోటీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా గట్టిగానే వీచినప్పటికి తెలుగు దేశం పార్టీ తరపున వల్లభనేని వంశీనే శాసన సభ్యుడిగా గెలుపొందారు. తెలుగు దేశం తరపున వల్లభనేని వంశీ 990 ఓట్ల మెజార్టితో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి అభ్యర్ది యార్లగడ్డ వెంకటరావుపై గెలుపొందారు. దీంతో ఇప్పుడు అదే అంశంపై యార్లగడ్డ వెంకటరావు దూకుడుగా ఉన్నారని అంటున్నారు. గన్నవరం లో వంశీకి ఎదురు గాలి ఉందని, గత ఎన్నికల్లో వంశీ కేవలం 990ఓట్ల మెజార్టితో గెలుపొందారు కాబట్టి, ఈ సారి ఎన్నికల్లో వంశీని ఓడించటం పెద్ద కష్టం కాదని వెంకటరావు వర్గం భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
గన్నవరంలో వంశీనే టార్గెట్...
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటంతో పాటుగా, గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. దీంతో ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంలో శాసన సభ్యుడు వల్లభనేని వంశీని ఓడించటమే ప్రధాన టార్గెట్‌గా ప్రతిపక్షాలు సిద్దమయ్యాయి. ఇప్పుడు యార్లగడ్డ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగు దేశానికి చేరువ కావటంతో, రాజకీయం మరింత వేడెక్కింది. అధికార పక్షం సపోర్ట్ వంశీకే ఉన్నందున వచ్చే ఎన్నికల్లో గన్న'వరం" ఎవరికి అన్నదాని పై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.