Financial Fraud In Srikakulam: మమ్మల్ని విశ్వసించి మీ సొమ్మును జమ చేస్తే రోజువారీ వడ్డీలు ఇస్తాం. దీంతో మీరు తక్కువ కాలంలోనే కోటీశ్వరులు అయిపోవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఆన్లైన్లో మా యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని అందులో వివిధ ప్లాన్లు, దానికి సంబంధించిన వడ్డీ వివరాలు చూసుకుని అందులో చేరటమే. వేరే వారిని ఇందులో చేర్చినా లాభం ఉంటుంది. ఇది ఆన్లైన్ ద్వారా లావాదేవీలు జరుపుతూ అధిక వడ్డీలు ఆశ చూపిన ఓ సంస్థ జారీ చేసిన ప్రకటన. వివరాల్లోకి వెళితే..స్థానిక సానావీధి వద్ద ఇండియన్ బ్యాంక్ మేడపైన ఐఏఎస్ పేరిట ఓ సంస్థ ఏర్పాటు చేశారు. ఆన్లైన్‌లో ఈ పేరుతో ఓ యాప్ కూడా ఉంది. ఓ వాట్సాప్ ఛానల్‌ కూడా క్రియేట్ చేశారు. 


అప్పలరెడ్డి అనే వ్యక్తి హెడ్‌గా ఉంటున్న ఈ సంస్థ ఐదు జిల్లాల్లో జనాలను బాగా మోటివేట్ చేసింది. జిల్లాలో సుమారు రూ.20 కోట్ల వరకూ వసూలు చేసింది. ప్రజల నుంచి డిపాజిట్‌లు తీసుకొని కొన్నాళ్లుగా వడ్డీలు ఇస్తున్నారు. అనధికారికంగా ఈ లెక్క చాలా ఎక్కువే ఉంటుందని సమాచారం. డిపాజిట్ చేసిన సొమ్ము బట్టి వడ్డీ చెల్లిస్తుంటారు. 


సానావీధి వద్ద సంస్థ కార్యాలయం బోర్డును మూడురోజుల కిందట తిప్పేశారు. రాత్రికి రాత్రే అందులోని సామాన్లంతా తరలించేశారు. ఈ విషయాన్ని సొమ్ము కట్టిన వారు ఆలస్యంగా గుర్తించారు. సంస్థ కార్యాలయం వద్దకు వెళ్ళి సొమ్ములు కట్టిన వారంతా ఆందోళనకు దిగారు.


ప్లాన్లతో ఆకర్షించి..
ఐఏఎస్ సంస్థ వివిధ రకాల ప్లాన్లతో కస్టమర్లను ఆకర్షించి ఇబ్బడిముబ్బడిగా వారి నుంచి సొమ్ములు వసూలు చేసినట్టు తెలిసింది. రూ.2100 జమ చేస్తే రోజుకు రూ.75 వడ్డీ కింద చెల్లిస్తారు. అలాగే రూ.5500 చెల్లిస్తే రోజుకు రూ.200, రూ.18300 చెల్లిస్తే రోజుకు రూ.660, రూ.55 వేలు చెల్లిస్తే రోజుకు రూ.1980, రూ.1.39 లక్షలు చెల్లిస్తే రూ.5350, రూ.3.55 లక్షలు చెల్లిస్తే రోజుకు రూ.13760, రూ.9 లక్షలు చెల్లిస్తే రోజుకు రూ.37500, రూ.18 లక్షలు చెల్లిస్తే రోజుకు రూ.74880, రూ.36 లక్షలు చెల్లిస్తే రోజుకు రూ.1.50 లక్షల వడ్డీ ఇస్తామని ఆశ చూపి పెద్దమొత్తంలో సొమ్ములను వసూలు చేశారు. 


ప్లే స్టోర్‌లో యాప్ డౌన్లోడ్ చేసుకుని పేటీఎం ద్వారా సొమ్మును చెల్లిస్తే వడ్డీ మరలా అదే యాప్‌లో జమ అవుతుంది. విత్ డ్రా చేసుకునేందుకు రిక్వెస్ట్ పెడితే కొన్నిసార్లు జమ అవడం, మరికొన్నిసార్లు షరతులు పెట్టి ఇంకా కొంత సొమ్ము చెల్లించాలని కోరడం వంటి పరిణామాలు జరుగుతుంటాయి. లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లోనే కావడంతో ఐఏఎస్ యాప్‌కు హెడ్ ఎవరన్నది సొమ్ములు కట్టేవారికి తెలియదు.



అయితే ఇదే విషయంపై కొందరు ప్రశ్నించడంతో నెల క్రితం సానా వీధి మెయిన్ రోడ్డులో కార్యాలయాన్ని తెరిచారు. ఆ ఆఫీస్‌ చూసి మరింత మంది కస్టమర్లు ఇందులో యాడ్ అయ్యారు. టార్గెట్ రీచ్ అయ్యాక మూడో కంటికి తెలియకుండా బోర్డు తిప్పేశారు. సొమ్ములు చెల్లించిన వారు అవి ఎలా వెనక్కి తెచ్చుకోవాలో అర్ధంకాక తలలు బాదుకుంటున్నారు.


కొత్తవారిని చేర్చుకునేందుకు..


ఐఏఎస్ యాప్‌లో కొత్తవారిని ఆకర్షించేందుకు చాలా ప్లాన్‌లు వేశారు. అప్పటికే సొమ్ము చెల్లిస్తూ వడ్డీలు పొందుతున్నవారు ఎవరినైనా రిఫరెన్స్ ఇస్తే కట్టిన సొమ్ములో సుమారు 30 శాతానికిపైగా కమీషన్ల రూపంలో ఇస్తామని చెప్పారు. ఇదే ఆశతో ఇందులో చేరినవారంతా కొత్తవారిని చేర్చడంపై దృష్టి కేంద్రీకరించారు. తద్వారా సంస్థకు భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది. అన్నీ చూసుకుని ఉడాయించేయడంతో సొమ్ములు కట్టినవారు లబోదిబోమంటున్నారు. 


ఈ మోసంపై ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా బాధితులకు అర్ధం కావడంలేదు. ఐఏఎస్ సంస్థకు చెందిన వాట్సాప్ గ్రూప్లో ఇప్పటికీ కొందరు మెసేజ్లు చేస్తూ చెల్లించిన సొమ్ముకు ఎటువంటి డోకా ఉండదని, కొత్తవారిని చేర్చాలని చెబుతుండటం కొసమెరుపు. 


Also Read: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు