తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద అధికార వైఎస్సార్‌సీపీ, టీడీపీ నేతల మధ్య దాడులు చేసుకున్న ఘటనకు సంబంధించి తాడేపల్లి పోలీసుస్టేషన్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కారు డ్రైవర్ తాండ్ర రాము ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో టీడీపీకి చెందిన 11 మంది నేతలపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, అధికార ప్రతినిధి పట్టాభి, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తదితర 11 మంది నేతలతో పాటు గుర్తు తెలియని మరో 30 మంది వ్యక్తులు తనను కులం పేరుతో ధూషించారని రాము తన ఫిర్యాదులో తెలిపాడు.
టీడీపీ నేతల ఫిర్యాదు..
చంద్రబాబు ఇంటిపై దాడి అంశానికి సంబంధించి వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఇంట్లోకి చొచ్చుకెళుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే.. తమపై దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు జంగాల సాంబశివరావు, తమ్మా శంకర్‌రెడ్డి అనే కార్యకర్త వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఇంటి ముట్టడికి రావడం ఏంటి? అని ప్రశ్నించినందుకు పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ దాడి సహా మరో 30-40 మంది తనపై దాడి చేసి గాయపరిచారని.. జంగాల సాంబశివరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు..
చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి బాధితుల నుంచి ఫిర్యాదులు అందుకున్న తాడేపల్లి పోలీసులు.. కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కోవిడ్ నిబంధనల ఉల్లంఘన, సమూహాలుగా ఏర్పడటం, గుంపులుగా తరలిరావడం, ప్రజల రాకపోకలను అడ్డుకోవడం, ప్రజాసేవకుల విధులకు ఆటంకం కలిగించడం వంటి ఆరోపణలతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో పాటుగా.. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం, జోగి రమేష్ వాహనాలు ప్రయాణించిన మార్గాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు సేకరిస్తున్నారు. చంద్రబాబు ఇంటి వద్ద ఉన్న పోలీసు గరుడ కంట్రోల్ రూమ్‌లో సీసీటీవీ ఫుటేజీలు తీసి ఘర్షణ విజువల్స్‌ను సేకరించినట్లు సమాచారం. డీజీపీ కార్యాలయం వద్ద వివరాలను సైతం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ నేతలపై మరో కేసు..
డీజీపీకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన టీడీపీ నేతలపై తాడేపల్లి పోలీసులు మరో కేసు నమోదు చేశారు. డీజీపీ కార్యాలయం గేట్లు నెట్టివేసేందుకు ప్రయత్నించారని తాడేపల్లి ఏఎస్‌ఐ మధుసూదనరావు ఫిర్యాదు చేశారు. డీజీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో దేవినేని ఉమ, నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్ర, అమర్నాథ్‌రెడ్డి, ఆలపాటి రాజేంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర, గొట్టిపాటి రవి, డోల బాల వీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు, బోడె ప్రసాద్, తెనాలి శ్రావణ్, జీవీ ఆంజనేయులు, నజీర్‍పై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
గవర్నర్‌ను కలిసిన టీడీపీ బృందం..
చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి గద్దె రామ్మోహన్, వర్ల రామయ్య, అశోక్ బాబు, ఆలపాటి రాజా తదితరులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలతో గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో వైఎస్సార్‌సీపీ, కొందరు పోలీసు అధికారుల పాత్రను నిగ్గు తేల్చేందుకు సమగ్ర విచారణ జరిపించాలని గవర్నర్‌కు విన్నవించారు.
Also Read: ZPTC MPTC Results Live Updates: ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు