DL Ravindra Reddy: మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌కు ఓటు వేసినందుకు తన చెప్పుతో తానే కొట్టుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజకీయాలను సీఎం జగన్ పూర్తిగా దిగజార్చారని ఆరోపించారు. శనివారం కడప జిల్లాలోని మైదుకూరులో డీఎల్ రవీంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్ట్‌పై ఆయన స్పందించారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన ఆయన.. అక్రమంగా కేసులో ఇరికించి అరెస్ట్ చేయడం దుర్గార్మమైన చర్యగా తప్పుబట్టారు.  రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారని, ఆయన ఎలాంటి తప్పు చేయలేదని డీఎల్ తెలిపారు.


చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేస్తే.. స్థానికంగా ఉన్న కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టలేదని డీఎల్ ప్రశ్నించారు.  విచారణ పేరుతో ఆయనను వేధించేందుకే నంద్యాల నుంచి అమరావతికి తీసుకెళ్లారని అన్నారు. విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్‌ను కూడా డీఎల్ తప్పుబట్టారు. చంద్రబాబు తప్పు చేసినట్లు సీఐడీ కోర్టుకు సమర్పించిన 28 పేజీల రిమాండ్ రిపోర్టులో ఎక్కడా లేదని తెలిపారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి దేశం వదిలి ఎక్కడికి వెళ్లరని, ఎప్పుడూ విచారణకు పిలిచినా వస్తారన్నారు. అలాంటప్పుడు రిమాండ్ విధించడం తప్పు అని డీఎల్ పేర్కొన్నారు.


న్యాయస్థానాలను విమర్శించకూడదని ఎక్కడా లేదని, చంద్రబాబు రిమాండ్‌పై జడ్జి ఎలాంటి ఆలోచన చేశారో తనకు తెలియదని డీఎల్ తెలిపారు. న్యాయ చరిత్రలో ఇలాంటి తీర్పు ఇచ్చిన జడ్జిని తాను ఎక్కడా చూలేదన్నారు. చంద్రబాబుకు డయాబెటిస్, బీపీ ఉన్నాయని, 73 వయస్సులో ఆయనకు రిమాండ్ విధించడం సరికాదన్నారు. 


అయితే డీఎల్ గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఆ పార్టీకి మద్దతుగా ఉన్నారు. రాజకీయ పరిణామాల క్రమంలో జగన్ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. గత కొద్ది నెలల క్రితం ఆ పార్టీని వీడారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన కొద్ది నెలలుగా గళం విప్పుతున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నిస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీనే అధికారంలోకి వస్తుందని, జనసేన-టీడీపీ పొత్తులో పోటీ చేస్తే తిరుగులేదని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం ఖాయమంటూ డీఎల్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కడప జిల్లాకు చెందిన డీఎల్‌కు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ కలిసి ఒకే పార్టీలో పనిచేయగా.. వైఎస్‌కు నమ్మినబంటుగా డీఎల్‌ గుర్తింపు పొందారు. డీఎల్ వైసీపీని వీడటంతో ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ముందు పసుపు కండువా కప్పుకుంటారని చెబుతున్నారు.


గత ఎన్నికలకు ముందే డీఎల్ టీడీపీలో చేరతారని, మైదుకూరు నుంచి ఆ పార్టీ తరపున పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ అనూహ్యంగా ఆయన యూటర్న్ తీసుకుని వైసీపీలో చేరారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్ల పాటు ఆ పార్టీలోనే కొనసాగారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ సొంత పార్టీపైనే విమర్శలు చేసి బయటకొచ్చారు. ప్రస్తుతం టీడీపీకి అనుకూలంగా ఆయన వ్యవహరిస్తున్నారు.