ODI World Cup 2023: టీ20 సూర్యుడు వన్డేలలో ఉదయించడా? - వన్ ఫార్మాట్ వండర్ సూర్య ఎంపికపై విమర్శలు

వన్డే వరల్డ్ కప్‌కు ఎంపికైన భారత ఆటగాళ్లలో సూర్యకుమార్ యాదవ్ ఒకడు.. పొట్టి క్రికెట్‌లో ఆడింది తక్కువ మ్యాచ్‌లే అయినా మేటి రికార్డులున్న సూర్య వన్డేలలో చూపే ప్రభావం ఎంత..?

Continues below advertisement

ODI World Cup  2023: అంతర్జాతీయ కెరీర్‌లో ఎంట్రీ ఇచ్చిన రెండేండ్లలోనే   పొట్టి క్రికెట్‌లో సూర్యకుమార్ యాదవ్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు.  టీ20లలో అతడు బరిలో ఉంటే  లక్ష్యం ఎంత పెద్దదైనా చిన్నబోవాల్సిందే. తనదైన  ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించే  సూర్య.. క్రీజులో నటరాజు వలే శివతాండవం చేస్తాడు. ‘అసలు క్రికెట్‌లో ఇలాంటి షాట్లు ఆడటం సాధ్యమా..?’ అన్న రేంజ్‌లో అతడి విధ్వంసం సాగుతోంది.  కానీ వన్డేలలో మాత్రం ఈ సూర్యుడు  ఇంతవరకూ ప్రకాశించిన సందర్భాలు అరుదు. వన్డేలు ఆడుతూ మ్యాచ్‌లను గెలిపించిన సందర్భాలు వేళ్లమీద లెక్కబెట్టగలిగే అన్ని కూడా  ఉండవు. సున్నాలు చుట్టడం లేదంటే  సింగిల్ డిజిట్‌కే నిష్క్రమించడం.. వన్డేలలో సూర్య అత్యధిక స్కోరు 64. మరి సూర్య వన్డే వరల్డ్ కప్‌లో మెరుస్తాడా..?

Continues below advertisement

టీ20లలో మేటి

పొట్టి ఫార్మాట్‌లో సూర్య ఆడింది  53 మ్యాచ్‌లే అయినా  చేసింది  1,841 పరుగులు.   ఈ రెండేండ్లలో భారత క్రికెట్‌లో మరే ఆటగాడికి లేనన్ని  సగటు సూర్య (46.02) సొంతం.   టీ20లలో సూర్య ఖాతాలో మూడు  సెంచరీలతో పాటు ఏకంగా 15 అర్థ సెంచరీలు ఉన్నాయి. గతేడాది  టీ20లలో వరల్డ్ నెంబర్ వన్‌గా ఎంపికైన సూర్య.. ఇప్పటికీ  ఆ ర్యాంకును కాపాడుకుంటున్నాడు.

వన్డేలలో శూణ్యం.. 

టీ20లలో అదరగొట్టే సూర్య వన్డేలలో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పటివరకూ అతడు  27 వన్డేలు ఆడి  25 ఇన్నింగ్స్‌లలో  537 పరుగులు మాత్రమే  చేయగలిగాడు.   సగటు 24.40గా ఉంది. చేసినవి రెండే రెండు అర్థ సెంచరీలు. వన్డేలలో హయ్యస్ట్ స్కోరు 64.  టీ20 ఫార్మాట్‌లో  రెచ్చిపోయే సూర్య వన్డేలలో వరుసగా అవకాశాలు దక్కించుకున్నా  విఫలమవుతుండటం కలవరపరిచేదే.  ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో సూర్య.. మూడు డకౌట్లు అయ్యాడు.  వెస్టిండీస్ సిరీస్‌లో మూడు వన్డేలు ఆడి 19, 24, 35 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తాజాగా  ఆసియా కప్‌లో భాగంగా శుక్రవారం  బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో సూర్యకు ఆడే అవకాశం దక్కగా 34 బంతులాడిన సూర్య చేసినవి  26 పరుగులు. 2022 నుంచి 21 మ్యాచ్‌లు ఆడిన  సూర్య అత్యధిక స్కోరు  34 పరుగులు.  గత 15 ఇన్నింగ్స్‌లలో సూర్య స్కోరు వివరాలు.. 26, 35, 24, 19, 0, 0, 0, 14, 31, 4, 6, 34, 4, 8, 9. 

20 ఓవర్ల ఫార్మాట్‌లో  అత్యద్భుత ఫామ్‌లో ఉన్న సూర్యకు వన్డేలు, టెస్టులలో కూడా ఆడే అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ల నేపథ్యంలో   బీసీసీఐ అతడికి వరుసగా అవకాశాలిచ్చినా అతడు వాటిని సద్వినియోగం  చేసుకోలేకపోతున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాతో మూడు వన్డేలలో మూడు సున్నాలు చుట్టిన సూర్య విండీస్ సిరీస్‌లోనూ   విఫలమయ్యాడు.  ఆసియా కప్‌కు ఎంపికైనా సూర్యను  తుది జట్టులో ఆడించడం లేదు. అయినా సూర్యను వన్డే వరల్డ్ కప్‌కు ఎంపిక చేయడం అందరినీ ఆశ్చర్యపరిచేదే.  

ప్రస్తుత ఫామ్‌‌ను బట్టి చూస్తే  సూర్యను తుదిజట్టులోకి తీసుకోవడం అతిశయోక్తే. కానీ వెన్ను గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న శ్రేయాస్ అయ్యర్ మళ్లీ గాయంతో ఇబ్బందిపడితే మాత్రం  సూర్యకు జట్టులో చోటు దక్కొచ్చు.  కెఎల్ రాహుల్ ఉన్నా అతడి పరిస్థితి కూడా  ఎప్పుడు ఏ గాయానికి బలవుతాడో తెలియని పరిస్థితి. ఒకవేళ ధైర్యం చేసి ఆడిస్తే మాత్రం   సూర్య.. తాను వన్ ఫార్మాట్ వండర్ కాదని నిరూపించుకోవాలి.  లేదంటే ఈ ప్రపంచకప్ తర్వాత భారత జట్టులో జరుగబోయే కీలక మార్పులలో   ఫస్ట్ బలయ్యేది సూర్యనే అని చెప్పడంలో సందేహమే లేదు. ఇప్పటికే సంజూ శాంసన్‌ను కాదని సూర్యకుమార్ యాదవ్‌కు  ఛాన్స్ ఇచ్చినందుకు గాను  క్రికెట్ ఫ్యాన్స్ బీసీసీఐ, సెలక్టర్లపై కారాలు మిరియాలు నూరుతున్నారు. బంగ్లాతో మ్యాచ్‌లో సూర్య విఫలమయ్యాక ఆ ఘాటు  సెలక్టర్లకు కాస్త ఎక్కువగానే తాకుతోంది. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement