Perni Nani on Pawan : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కాపులు గుండెల్లో పెట్టుకున్నారని మాజీమంత్రి పేర్ని నాని చెప్పారు. 2024, 2029లోనూ కాపులు జగన్ కే పట్టం కడతారని స్పష్టం చేశారు. కాపుల కోసం పవన్‌ ఏం చేశాడో చెప్పాలని డిమాండ్‌ చేశాడు. కులాలపైనా పవన్‌కు కనీస అవగాహన లేదని.. రాజకీయాల్లో ఆస్కార్‌ ఉంటే.. ఏటా పవన్‌కే ఇవ్వాలని ఎద్దేవా చేశారు. మరో ఏడాదిలో జనసేన అధినేత అన్ని రంగులు బయటపడతాయని అన్నారు.


తన కులంవాళ్లు ఓటేస్తే నేను ఓడిపోయేవాడినే కాదని పవన్‌ అంటున్నాడు.. అసలు  రాజకీయ నేతకు, ప్రజా నాయకుడికి ఏ కులం అయితే ఏంటని ప్రశ్నించారు. ఒక్క కుల ఓట్లు వేస్తే చట్టసభలకు వెళ్లాలని అనుకుంటారా అని ప్రశ్నించారు. ఒక్క కులం ఓట్లతో కుల నేత అవుతారు.. ప్రజా నేత కాదని స్పష్టం చేశారు. చంద్రబాబు బాగుండాలనేదే పవన్‌ కల్యాణ్‌ అంతిమ లక్ష్యమని పేర్ని నాని విమర్శించారు. 






లోపాయికారీ ఒప్పందాలకు పవన్‌ స్పెషలిస్ట్ అని పేర్ని నాని విరుచుకుపడ్డారు. తప్పుడు రాజకీయాలు చేయడంలో చంద్రబాబుతో పవన్‌ పోటీపడుతున్నాడని దుయ్యబట్టారు. కాపులను చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టేందుకే పవన్‌ తప్పుడు ప్రకటనలు చేస్తున్నాడరని విమర్శించారు.  చంద్రబాబు ప్రాపకం కోసం ప్రభుత్వంపై పవన్‌ విషం చిమ్ముతున్నాడు’ అని మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు.  


పవన్ వల్ల కాపులకు ఒరిగిందేంలేదు - మంత్రి బొత్స 


 పవన్ కల్యాణ్ వల్ల కాపులకు ఒరిగిందేంలేదని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. తరాలుగా వస్తున్న కులం గురించి చెప్పుకోవడానికి సిగ్గేమిటని పవన్ కల్యాణ్ ను ప్రశ్నిచారు. తాను మంత్రిగా ఉంటే తనవాళ్లు చెడిపోయింది ఏంటి? మిగతా వాళ్లున్నప్పుడు బాగు పడిందేంటో పవన్‌ కల్యాణ్‌ చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఉనికి కోసమే పవన్ పాట్లు అని ఆరోపించారు. కులం లేదనే పవన్, గంటకోమారు కులాల కుంపటి పెడతారని విమర్శించారు. నీ కులాన్ని చెప్పుకోడానికి నీకు సిగ్గెందుకు పవన్‌ కల్యాణ్‌ అంటూ బొత్స నిలదీశారు. 


అప్పుడు పవన్ ఏంచేశారు? 
 
"తెలంగాణాలో గతంలో 26 బీసీ కులాలు తొలగించారు. అప్పుడు మేము పోరాటం చేశాం. కానీ మీరేం చేశారు?. చంద్రబాబుతో కలిసి ఉన్నా, మీరు కనీసం ప్రశ్నించలేదు. ఆనాడు న్యాయ పోరాటానికి కూడా మేము సిద్ధమయ్యాం. కేంద్రంలో బీజేపీని కూడా మీరు ప్రశ్నించలేకపోయారు?.  బీసీల కోసం చంద్రబాబు ఏం చేయలేదు. అందుకే ఆయన పవన్‌ కల్యాణ్‌తో మాట్లాడిస్తున్నారు. చంద్రబాబు చెప్పిందే పవన్‌ కల్యాణ్‌ చేస్తున్నారు. మా ప్రభుత్వంపై బురద చల్లడమే వారిద్దరి అజెండా.  బీసీలు బ్యాక్‌ బోన్‌ క్లాస్‌ అని జగన్‌ చెప్పారు. అందుకే వారి కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి ఒక్కటి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. అన్ని వర్గాలకు జగన్‌ ఎంతో మేలు చేస్తున్నారు. మేనిఫెస్టోలో దాదాపు 99 శాతం హామీలు అమలు చేశాం. అందుకే మొత్తం 175 స్థానాల్లో గెలుస్తాం" - మంత్రి బొత్స సత్యనారాయణ