Balineni Srinivasa Reddy : ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ లో తాను పెట్టుబడులు పెట్టినట్లు వస్తు్న్న ఆరోపణలను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఖండించారు. బాలినేని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థలో పెట్టుబడులు పెట్టినట్లు విశాఖపట్నం జనసేన కార్పొరేటర్ ఐటీ శాఖ అధికారులకు ఫిర్యాదుచేశారు. ఈ విషయంపై బాలినేని వివరణ ఇచ్చారు. జనసేన కార్పొరేటర్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. తనకు సినీ ఇండస్ట్రీలో దిల్ రాజు లాంటి స్నేహితులు చాలా మంది ఉన్నారని, అంతమాత్రాన సినిమాల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపించడం సరికాదన్నారు. తనతో పాటు తన వియ్యంకుడు భాస్కర్‌రెడ్డి ఈ నిర్మాణ సంస్థలో రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదన్నారు. జనసేన చేసిన ఆరోపణలను రుజువు చేస్తే తన ఆస్తి మొత్తం రాసిస్తానన్నారు. అంతేకాకుండా రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని బాలినేని సవాల్‌ చేశారు. 


జనసేన నన్ను టార్గెట్ చేసింది 


తనకు సినీరంగంలో పెట్టుబడులు ఉన్నాయో లేదో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరా తీసుకోవచ్చని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. తనకు సినీరంగంలోని కొందరితో పరిచయాలు ఉన్న మాట వాస్తవమేనన్నారు. స్నేహితులు ఉన్నంత మాత్రాన పెట్టుబడులు పెట్టానని ఆరోపించడం సరికాదన్నార. జనసేన నేతలు తనను కావాలనే టార్గెట్ చేస్తున్నారని, దీని వెనుక కుట్ర దాగి ఉందన్నారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల్నుంచి తప్పుకుంటానన్నారు. ఈ ఆరోపణలు అవాస్తమని తేలితే జనసేన నేతలపై పవన్ కల్యాణ్ చర్యలు తీసుకోవడానికి సిద్ధమైనా? అని బాలినేని ప్రశ్నించారు. జనసేన కార్పొరేటర్ చేసిన వ్యాఖ్యలపై పవన్ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.  మైత్రి మూవీ మేకర్స్ లో పెట్టుబడులు పెట్టిన వాళ్లను వదిలేసి జనసేన తనను టార్గెట్ చేయడం వెనక కుట్ర ఉందని బాలినేని అనుమానం వ్యక్తం చేశారు.  జనసేన నాయకుడు మూర్తి యాదవ్ మతిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వీరసింహారెడ్డి ఆడియో ఫంక్షన్‌కి ఒంగోలులో పర్మిషన్ ఇప్పిస్తే ఆ సినిమాకి తాను పెట్టుబడి పెట్టానని ప్రచారం చేశారన్నారు. ఏ సినిమాకైనా నేను కానీ, నా వియ్యంకుడు కానీ పెట్టుబడి పెట్టానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. టీడీపీ నేత దామచర్ల జనార్దన్ రాజుపాలెంలో డీకే లాండ్ లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు.  


తలసాని శ్రీనివాస్ యాదవ్, బాలినేని హస్తం  


 మైత్రి మూవీ మేకర్స్ అక్రమ లావాదేవీల విషయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి బినామీ, ఆయన వియ్యంకుడు భాస్కర్ రెడ్డి, వైసీపీ నేత ఆడిటర్‌ గన్నమనేని వెంకటేశ్వరరావుపై  విశాఖలోని ఐటీ అధికారులకు విశాఖ జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌ శుక్రవారం ఫిర్యాదు చేశారు. విశాఖ పోర్టు స్టేడియం వద్ద ఉన్న కార్యాలయంలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయన్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ అక్రమాస్తులు, లావాదేవీలపై దిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం తనిఖీలు చేస్తుందన్నారు. ఈ అక్రమ లావాదేవీల వెనుక తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హస్తం ఉన్నట్లు ఆరోపణలున్నాయన్నారు. బాలినేని బినామీగా పేరొందిన  ఆయన వియ్యంకుడు భాస్కర్ రెడ్డి ఈ వ్యవహారాలు చక్కబెడుతున్నట్లు ఆధారాలున్నాయన్నారు.  వీరి అక్రమ లావాదేవీలు, మనీ ట్రాన్స్ ఫర్స్ పై ఐటీ అధికారులను విచారణ జరిపించాలని కోరినట్లు తెలిపారు.