తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజులుగా అక్కడక్కడ కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానలు కురిసిన సంగతి తెలిసిందే. అక్కడక్కడా పంటలు కూడా దెబ్బతిన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. కరీంనగర్‌, చొప్పదండి సహా మరికొన్ని ప్రాంతాల్లో కురిసిన వడగళ్ల వర్షాల వల్ల పంటలు బాగా దెబ్బతిన్నాయి. అందుకే ఏయే ప్రాంతాల్లో ఎంత మేరకు పంటలు దెబ్బతిన్నాయో అంచనా వేయడానికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర చీఫ్‌ సెక్రెటరీ శాంతి కుమారికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి ఆయా జిల్లాల్లో దెబ్బతిన్న పంటలకు సంబంధించిన రిపోర్టులు తెప్పించాలని ఆదేశించారు.


కరీంనగర్ జిల్లాలో కల్లాల్లో ఎండబోసిన ధాన్యం కుప్పలు శనివారం (ఏప్రిల్ 22) కురిసిన అకాల వర్షంతో నీట మునిగాయి. వరదలో వడ్లన్నీ కొట్టుకుపోయాయి. ఉమ్మడి కరీంనగర్​ జిల్లాల్లోనూ అకాల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జగిత్యాల, కోరుట్ల, మెట్​పల్లి, పెద్దపల్లి జిల్లాలోనూ వర్షంతో ధాన్యం రాశులు తడిసిపోయాయి. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, రామడుగు, కరీంనగర్ రూరల్, జమ్మికుంట, సైదాపూర్, మానకొండూరు మండలాల్లో రైతులకు తీవ్ర నష్టం వచ్చింది. వర్షం దాదాపు గంటకు పైగా కురవడంతో మార్కెట్ యార్డులోకి పై నుంచి వచ్చే వరదతో వడ్లన్నీ కాల్వలో కొట్టుకుపోయాయి. కొన్ని కోళ్ల షెడ్డు కూలి కోళ్లు చనిపోయి తీవ్ర నష్టం కలిగింది.


ఇక వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు.. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ద్రోణి / గాలిలోని అనిచ్చితి  వాయువ్య మధ్యప్రదేశ్ నుండి ఇంటీరియర్ మహారాష్ట్ర, ఇంటీరియర్ కర్నాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టంకి 0.9 కి మీ ఎత్తు వద్ద కొనసాగుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు   కొన్ని చోట్ల వచ్చే అవకాశం ఉంది. రాగల ఐదు రోజులకు రాష్ట్రంలో  పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా అనేక చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈరోజు, రేపు తెలంగాణ రాష్ట్రములో ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులు (30 - 40 కి.మి) తో కూడిన వర్షాలు కొన్నిచోట్ల వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.


నేడు తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో, ఈదురు గాలులతో (30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో) కూడిన వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.