Porus Factory Fire Accident Victims Ex Gratia: ఏలూరు జిల్లాలోని ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో ఉన్న పోరస్‌ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ మేరకు బాధితుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షలు పరిహారంగా ఇస్తామని ప్రకటించారు. ఈ సంఘటనపై పూర్తి దర్యాప్తు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ను, ఎస్పీని ఆదేశించారు. అలాగే, గాయపడిన వారికి పూర్తి స్థాయిలో మెరుగైన వైద్య సహాయం అందాలని ఆదేశించారు.


బుధవారం అర్ధరాత్రి పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో యూనిట్‌-4లో రియాక్టర్ పేలి మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన 13 మందిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. మృతుల్లో ఐదుగురు బీహార్‌కు చెందిన వారే ఉన్నారు. ఈ ప్రమాదంలో 5 మంది సజీవ దహనం అయ్యారు. 


అందరి పరిస్థితి విషమంగానే
విజయవాడ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ‘‘విజయవాడ ఆస్పత్రిలో 12 మందిని చేర్చారు. ఆస్పత్రికి తీసుకొస్తుండగా ఒకరు మృతి చెందారు. 12 మందికి చికిత్స అందిస్తున్నాం. ఒకరిద్దరు తప్ప అందరి పరిస్థితి విషమంగానే ఉంది. వారికి 70 శాతానికి పైగా కాలిన గాయాలయ్యాయి. బాధితులను అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నాం’’ అని భాగ్యలక్ష్మి అన్నారు.


గత రాత్రి 11 గంటల సమయంలో ఫ్యాక్టరీ ఆవరణలోని యూనిట్ - 4 లో భారీ శబ్దంతో మంటలు చెలరేగి ఎగిసిపడ్డాయి. మొత్తం ఫ్యాక్టరీ లో150 మంది షిఫ్ట్ డ్యూటీలో ఉన్నట్లు సమాచారం. అయితే ప్రమాదం జరిగిన ఈ బ్లాక్ లో మొత్తం 30 మంది పని చేస్తున్నారు. వారిలో 13 మందికి గాయాలు కాగా వారిని తొలుత నూజివీడు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి, జి.యం.హెచ్ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న  పోలీస్, రెవెన్యూ, ఫైర్ అధికారులు, సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 


నూజివీడు డీఎస్పీ, సీఐ, ఇతర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ అనిల్ తో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మాట్లాడారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్న వాటిపై వివరాలు సేకరించారు.


ఏదైనా రసాయ చర్య ఎక్కువగా జరిగి రియాక్టర్ పేలిందా లేక షార్ట్ సర్క్యూట్ జరిగిందా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్లాంట్ ఇంచార్జ్ శుక్లా కూడా లోపలే ఉన్నారని, ఆయన కూడా మరణించి ఉంటారని మంటలు అదుపు చేసిన అనంతరం ప్లాంట్ లోపల ఇంకా ఏమైనా మృతదేహాలు ఉన్నాయా అని కూడా పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా వైద్యం అందించాలని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వైద్యాధికారులను సూచించారు. నూజివీడు డిఎస్పి నేతృత్వంలో పోలీసులు ఫ్యాక్టరీ ఆవరణలో ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.