ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఏలూరు జిల్లాలోని ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో ఉన్న పోరస్ అనే కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం అర్ధరాత్రి ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే, ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పటిదాకా ఆరుగురు చనిపోయినట్లు తెలుస్తోంది. వీరిలో 5 మంది సజీవ దహనం అయ్యారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోయారు. ఇంకా చాలా మందికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి.
వెంటనే స్పందించిన యాజమాన్యం, స్థానికులు బాధితులను మొదట నూజివీడు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తీసుకెళ్లారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 3 ఫైర్ ఇంజన్లతో రాత్రి 11 గంటల నుండి ఉదయం వరకు మంటలు అదుపు చేస్తూ ఉన్నారు ఫైర్ సిబ్బంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా రంగంలోకి దింపారు.
ప్రమాదం జరిగిన బ్లాక్‌లో విధుల్లో 30 మంది
గత 40 సంవత్సరాల క్రితం ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టి అంచెలంచలుగా ఇది విస్తరించింది. గత రాత్రి 11 గంటల సమయంలో ఫ్యాక్టరీ ఆవరణలోని యూనిట్ 4 లో భారీ శబ్దంతో మంటలు చెలరేగి ఎగిసిపడ్డాయి. మొత్తం ఫ్యాక్టరీ లో150 మంది షిఫ్ట్ డ్యూటీలో ఉన్నట్లు సమాచారం. అయితే ప్రమాదం జరిగిన ఈ బ్లాక్ లో మొత్తం 30 మంది పని చేస్తున్నారు. వారిలో 13 మందికి గాయాలు కాగా వారిని తొలుత నూజివీడు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి, జి.యం.హెచ్ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్, రెవెన్యూ, ఫైర్ అధికారులు, సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ
పక్కనే మరో రియాక్టర్ కూడా ఉండడంతో అది పేలే అవకాశం ఉండడంతో సిబ్బంది చర్యలు చేపట్టారు అధికారులు. నూజివీడు డీఎస్పీ, సీఐ, ఇతర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ అనిల్ తో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మాట్లాడారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్న వాటిపై వివరాలు సేకరించారు.
ఏదైనా రసాయ చర్య ఎక్కువగా జరిగి రియాక్టర్ పేలిందా లేక షార్ట్ సర్క్యూట్ జరిగిందా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్లాంట్ ఇంచార్జ్ శుక్లా కూడా లోపలే ఉన్నారని, ఆయన కూడా మరణించి ఉంటారని మంటలు అదుపు చేసిన అనంతరం ప్లాంట్ లోపల ఇంకా ఏమైనా మృతదేహాలు ఉన్నాయా అని కూడా పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా వైద్యం అందించాలని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వైద్యాధికారులను సూచించారు. నూజివీడు డిఎస్పి నేతృత్వంలో పోలీసులు ఫ్యాక్టరీ ఆవరణలో ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.