Agrigold Scam: అగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరో అడుగు ముందుకు వేసింది. అగ్రిగోల్డ్ ప్రమోటర్లు ఏవీ రామారావు, శేషునారాయణరావు, హేమసుందర్‌పై బుధవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. వారితోపాటు అగ్రిగోల్డ్ ఫామ్ ఎస్టేట్స్ సహా మొత్తం 11 అనుబంధ కంపెనీలపై ఛార్జిషీట్ వేసింది. నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఛార్జిషీట్‌ను విచారణకు స్వీకరించింది. అక్టోబరు 3న కోర్టుకు హాజరుకావాలంటూ అగ్రిగోల్డ్ ప్రమోటర్లు, కంపెనీలకు సమన్లు జారీ చేసింది.
ఛార్జిషీట్‌లో ప్రమోటర్లు అవ్వా వెంకట రామారావు, ఏవీ శేషునారాయణ రావు అలియాస్ కుమార్, అవ్వా హేమసుందర వరప్రసాద్ అలియాస్ రాజాలను నిందితులుగా ఈడీ పేర్కొంది. అగ్రిగోల్డ్ ఫామ్ ఎస్టేట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అగ్రిగోల్డ్ కన్‌స్ట్రక్షన్స్, డ్రీమ్ ల్యాండ్ వెంచర్స్, బుధపాలిత టింబర్ ఎస్టేట్స్, నాగవల్లి ప్లాంటర్స్, హరితమోహన ఆగ్రో ప్రాజెక్ట్స్, ఆర్కా లీజర్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, అగ్రిగోల్డ్ ఫుడ్స్ అండ్ ఫామ్ ప్రొడక్ట్స్, అగ్రిగోల్డ్ ప్రాజెక్ట్స్, బ్రూక్ ఫీల్డ్స్ అండ్ రిసార్ట్స్, అగ్రిగోల్డ్ ఆర్గానిక్స్ కంపెనీలను కూడా నిందితుల జాబితాలో చేర్చింది.
ఈడీ చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు అక్టోబరు 3న హాజరు కావాలని నిందితులకు సమన్లు జారీ చేసింది. నిందితులు ఏవీ రామారావు, శేషు నారాయణ రావు, హేమసుందర వరప్రసాద్‌తో పాటు కంపెనీల తరఫున హాజరు కావాలని ప్రతినిధులు కేఎస్ రామచంద్రరావు, సవడం శ్రీనివాస్, ఎం.భానోజీ రావు, అవ్వా ఉదయ భాస్కర్ రావు, సీతారామారావు, కె.మల్లేశ్వర నాయుడుకు సమన్లు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు చెందిన 32 లక్షల మందిని సుమారు రూ.6,380 కోట్లు మోసం చేశారని ఏపీ సీఐడీ నిందితులపై అభియోగం మోపింది. ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసుల ఆధారంగా నిధుల మళ్లింపుపై మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈడీ విచారణ జరిపింది. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేయడంతో పాటు రూ.4,141 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ప్రమోటర్లు ఏవీ రామారావు, శేషునారాయణరావు, హేమసుందర వరప్రసాద్‌ను ఇప్పటికే అరెస్టు చేసి, విచారణ జరిపింది. అధిక వడ్డీ, ప్లాట్ల పేరిట డిపాజిటర్ల నుంచి డబ్బులు వసూలు చేసి డొల్ల కంపెనీలకు నిధులు మళ్లించి, వాటి పేరిట ఆస్తులు కూడబెట్టినట్లు సీఐడీ ఆరోపించింది.
హైకోర్టును ఆశ్రయించిన పలువురు
అగ్రిగోల్డ్ ఆస్తుల్లో కొన్నింటిని ఈడీ జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ సీఐడీ, ఈడీ వేర్వేరుగా ఇచ్చిన ఉత్తర్వులను గతంలో బ్యాంకులు సవాలు చేశాయి. అగ్రిగోల్డ్‌కు చెందిన కొన్ని ఆస్తులను బ్యాంక్ వేలం వేయగా తాను కొనుగోలు చేశానని, దానిని జప్తు చేయడానికి వీల్లేదని ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఆల్ ఇండియా అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరో వ్యాజ్యం వేస్తూ, అగ్రిగోల్డ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి ముందే కొన్ని ఆస్తులు తాము కొనుగోలు చేశామని, వాటిని ఈడీ ఎటాచ్ చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు.
అగ్రిగోల్డ్ నుంచి కొనుగోలు చేసిన భూముల్లో నిర్మించుకున్న అపార్ట్‌మెంట్‌ను సైతం సీఐడీ జప్తు చేసిందని పేర్కొంటూ ఏలూరు ఫార్చ్యూన్ అపార్ట్‌మెంట్ ఓనర్స్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించింది. వాటిపై ధర్మాసనం గత నెలలో విచారణ జరిపింది. ఈ వ్యాజ్యాలపై ఈడీ తరఫు న్యాయవాది జ్యోష్యుల భాస్కరరావు, అగ్రిగోల్డ్ యాజమాన్యం తరఫున న్యాయవాది పీఎస్‌పీ సురేష్‌కుమార్, బ్యాంకుల తరఫు న్యాయవాది ద్యుమని, ఏపీ సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు.