East Godavari Year Ender 2022 : ఓ పక్క గలగలా పారే జీవనది గోదావరి.. మరో పక్క ఎగిసిపడే అలలతో తీరాన్ని తాకే సువిశాల సాగరం. మధ్యలో ఎంతో ఆహ్లాదాన్ని పంచేలా పచ్చని కోనసీమ. ఉద్యాన పంటలతో తలతూగే మెట్టభూములు. కొబ్బరితోటల మధ్య పచ్చని పైరులతో భాసిల్లే వ్యవసాయ కమతాలు. ఎక్కడచూసినా ప్రశాంత వాతావరణమే. కనులకు, మనసుకు హాయిని గొల్పే ప్రశాంత వాతావరణమే. జిల్లాల పునర్విభజన తరువాత తూర్పుగోదావరి జిల్లా మూడు జిల్లాలుగా మారింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకు నామకరణం చేసిన ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో జిల్లా కేంద్రంగా నడచిన కాకినాడ కేంద్రంగా కాకినాడ జిల్లా, కోనసీమ ప్రాంతానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా నామకరణం చేశారు. అయితే 2022లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నో సంచలన సంఘటనలు చోటుచేసుకున్నాయి. రోజుల తరబడి వార్తల్లో నిలిచింది తూర్పుగోదావరి జిల్లా. 


అమలాపురం అల్లర్లతో అతలాకుతలం..


జిల్లాల పునర్విభజన తరువాత కోనసీమ ప్రాంతానికి మొదట కోనసీమ జిల్లా అని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే కోనసీమకు డా. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పేరు పెట్టాలని 2022 మార్చి 7న లాంగ్‌మార్చ్‌ నిర్వహించాయి దళిత సంఘాలు. ఈ నిరసనకు వేలాదిగా తరలివచ్చి తమ వాదనను బలంగా వినిపించడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడి కోనసీమ జిల్లాకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా నామకరణం చేసేందుకు ప్రిలిమినరీ నోటీస్‌ రిలీజ్‌ చేసి అభిప్రాయాలు కోరింది. దీంతో వివాదం రాజుకుంది. కోనసీమ జిల్లా సాధనసమితి పేరిట జేఏసీ ఏర్పడి ఉద్యమ కార్యచరణకు పిలుపునిచ్చారు. మే నెల 24న ఛలో అమలాపురం కార్యక్రమాన్ని నిర్వహించారు.  కలెక్టరేట్‌ ముట్టడికి పెద్దఎత్తున అమలాపురం చేరుకుంటున్న వారిని పోలీసు యంత్రాంగం కట్టడి చేసే ప్రయత్నం చేసింది. దీంతో రెచ్చిపోయిన నిరసనకారులు అమలాపురంలోని నల్లవంతెన మీదుగా కలెక్టరేట్‌ చేరుకునేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ సంఘటనలో పలువురు పోలీసులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ తరువాత కలెక్టరేట్‌ వద్దకు వేలాదిగా చేరుకుని అక్కడ నిరసన చేపట్టారు. అక్కడ పార్కింగ్‌ చేసిన ఓ ప్రైవేటు కాలేజ్‌ బస్సును ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. పరిస్థితి పూర్తిగా అదుపుతప్పడంతో పోలీసులు కేవలం ప్రేక్షకపాత్ర చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అల్లరి మూకలు మరింత చెలరేగి అక్కడి నుంచి నేరుగా మంత్రి విశ్వరూప్‌ ఇంటికి చేరుకుని మంత్రి ఇంటికి నిప్పుపెట్టారు. ఆ తరువాత ఎర్ర వంతెన వద్ద రెండు ఆర్టీసీ బస్సులకు నిప్పుపెట్టారు. సమీపంలోనే ఉన్న ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ ఇంటికి నిప్పుపెట్టి ఆ తరువాత నూతనంగా నిర్మిస్తున్న విశ్వరూప్‌ ఇంటికి నిప్పుపెట్టారు. కేవలం గంట వ్యవధిలో అల్లర్లు చెలరేగి విధ్వంసకాండ జరగ్గా సాయంత్రం 7 గంటలకు పరిస్థితి అదుపులోకి వచ్చింది. సంఘటన జరిగిన నాటినుంచి నెల రోజుల పాటు కర్ఫ్యూ విధించారు. దాదాపు నెలరోజుల పాటు ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేశారు. ఈ అల్లర్లలో సంబంధం ఉన్న 250 మందిని అరెస్ట్ చేశారు. నేటికీ ఈ కేసు దర్యప్తు జరుగుతుండగా 50 మంది వరకు పరారీలో ఉన్నారు. దేశవ్యాప్తంగా అమలాపురం అల్లర్ల గోడవ సంచలనం రేకెత్తించింది.


ఎమ్మెల్సీ అనంతబాబుపై హత్యానేరం 


తన కారు మాజీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యంను  హత్యచేసి కారులో ఇంటికి తీసుకొచ్చి వదిలి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌పై హత్యానేరం ఆరోపణల నుంచి అరెస్ట్‌ దాకా కాకినాడ కేంద్రంగా హైడ్రామా నెలకొంది. మే 19వ తేదీ అర్ధరాత్రి కారుడ్రైవర్ డెడ్‌ బాడీను తీసుకొచ్చి వదిలి వెళ్లిన సంఘటనపై పెద్దఎత్తున ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు బాధిత కుటుంబం తరపున నిలబడ్డాయి. దీంతో ప్రభుత్వం దిగివచ్చి సమగ్ర విచారణ చేపట్టింది. మే 23న ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రెస్‌మీట్‌ లో హత్య చేసింది అనంతబాబేనని వెల్లడిరచారు. ఈ సంఘటన కాకినాడ జిల్లాను ఓ కుదుపు కుదిపేసింది. ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ కారు డ్రైవర్ హత్య జరిగిన నాటి నుంచి వారం రోజులపాటు కాకినాడ, రాజమండ్రిలో పెద్దఎత్తున నిరసనలు జరిగాయి.


నెల రోజులు ముప్పుతిప్పలు పెట్టిన బెంగాల్‌ టైగర్‌ 


కాకినాడ జిల్లాలో దాదాపు నెల రోజుల పాటు సంచరిస్తూ పశువులపై దాడులుకు తెగబడుతూ కాకినాడ జిల్లా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది రాయల్‌ బెంగాల్‌ టైగర్‌. పులిని పట్టుకోవాలని శతవిధాలా ప్రయత్నించిన అటవీశాఖ అధికారులు చివరకు పట్టుకోలేకపోయారు. ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని శరభవరం తదితర ప్రాంతాల్లో మొదటిసారిగా పెద్దపులి కదలికలు రైతులు గమనించారు. ఆ తరువాత పుశువులపై దాడులు చేయడంతో అటవీశాఖ అధికారులు బోన్‌ను ఏర్పాటు చేసి ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. మొదటిసారిగా జూన్‌ 5 రాత్రి పులి కదలికలు కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆనాటి నుంచి నెల రోజులపైబడి సుమారు 40 పశువులపై దాడిచేసిన పెద్దపులి దాదాపు 35
పశువులను పొట్టనపెట్టుకుంది. ఆ తరువాత పైడిపాలలో చివరిసారిగా పశువులపై దాడిచేసి విశాఖ జిల్లాలోకి ప్రవేశించింది. దాదాను నెల రోజుల పైబడి పెద్దపులి భయంతో కాకినాడ జిల్లా ప్రజలు వణికిపోయిన పరిస్థితి నెలకొంది.