కరోనా థర్డ్ వేవ్, ఒమిక్రాన్ భయాందోళనల నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటున్నారు. కరోనా థర్డ్ వేవ్ లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నా తీవ్రత అంతగా లేకపోవడంతో ప్రజలు పెళ్లిళ్లు, ఇతర వేడుకలకు ముందడుగు వేస్తున్నారు. మాఘమాసం మొదలుకావడంతో కల్యాణ వేడుకలకు అంతా సన్నద్ధమవుతున్నారు. రాబోయే రోజుల్లో కరోనా థర్డ్ వేవ్ మరింత తీవ్రం అవ్వకముందే ముహూర్తాలు పెట్టించుకుని లగ్నాలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల నాలుగో తేదీ నుంచి 21 వ తేదీ వరకు వరుస ముహూర్తాలు ఉండడంతో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటిలో అయిదు, పది తేదీల్లో ఎక్కువ ముహుర్తాలు ఉన్నాయి. దీంతో కల్యాణ మండపాలు దొరకని పరిస్థితి కనిపిస్తుంది. ఇక పూల మండపాలు, షామియానాలు, కేటరింగ్లు ఇలా వివాహ వేడుకకు సంబంధించి పురమాయింపులన్నీ ముందస్తుగానే బుక్ చేసుకోవడంతో ఈ తేదీల్లో ఇక ఏం చేయలేమంటూ చేతులెత్తేసే పరిస్థితి కనిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరం రత్నగిరి శ్రీసత్యనారాయణస్వామి వారి సన్నిధిలో వివాహ వేడుకలు నిర్వహించుకునేందుకు ఎక్కువ మంది ప్రయత్నించడంతో ఈ మాఘమాసంలో ఇక్కడ దాదాపు 500 పైబడి వివాహాలు జరవగవచ్చని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో దేవస్థానం అధికారులు  మరింత అలెర్ట్ అయ్యారు. వివాహ వేడుకకు హాజరయ్యేవారు కచ్చితంగా మాస్కు ధరించి, భౌతిక దూరంపాటించాలని సూచిస్తున్నారు. నవ వధూవరులకు కూడా కరోనా నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. 


ఆంక్షలతో సింపుల్ గా 


కరోనా ఆంక్షల నేపథ్యంలో పెళ్లికుమారుని వైపు నుంచి 100 మందికి పెళ్లి కుమార్తె వైపు నుంచి 100 మందికి మాత్రమే అనుమతులు ఇస్తుండడంతో కేవలం కుటుంబ సభ్యులు, చాలా ముఖ్యమైనవారికి మాత్రమే కల్యాణ శుభలేఖలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లోగడ ఒక్కో వేడుకకు 500 నుంచి 1000 వరకు కల్యాణ శుభలేఖలు ముద్రించుకునే పరిస్థితి నుంచి 200 కు మించి ఎవ్వరూ ఆర్డర్లు ఇవ్వడంలేదని శుభలేఖల తయారీ దారులు చెబుతున్నారు. చాలా మంది ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో ఎక్కువశాతం ఆలయాల్లోనే వివాహ తంతును నిర్వహించి ఆ తరువాత ఎవరి ఇళ్ల వద్ద వారు రిసెప్షన్లు ఏర్పాటు చేసుకునేందుకే సుముఖత వ్యక్తం చేస్తున్నారు. 


జాగ్రత్తలు తప్పనిసరి 


వివాహ వేడుకకు సమూహాలుగా ఎక్కువ మంది తిరిగే అవకాశాలున్నందున తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెళ్లి వేడుకలోనూ మాస్కులు, శానిటైజర్లు ఏంటని చాలా మంది లైట్ తీసుకుంటారని, అయితే ఇటువంటి సమయాల్లోనే కోవిడ్ వ్యాప్తి ఎక్కువవుతందని హెచ్చరిస్తున్నారు. ఇక వివాహ విందుల విషయంలోనూ నిర్వాహకులు కచ్చితమైన నిబంధనలు పాటించాలని, లేకుంటే కోవిడ్ వ్యాప్తి మరింత పెరిగే పరిస్థితి ఉత్పన్నమవుతుందంటున్నారు. అయితే చాలా మంది విందులకు చాలా దూరంగా ఉంటున్నారు. పెళ్లి పిలుపు అందుకున్న చాలా మంది వధూవరులను ఆశీర్వదించి, కట్న కానుకలను సమర్పించి ఆపై విందు ఆరగించకుండానే ఏదో ఒక సాకు చెప్పి వెళ్లిపోతున్నారు. దీంతో ఎస్టిమేషన్ కు తగ్గట్టుగానే విందు భోజనాలు సిద్ధం చేసినా ఎక్కువగా మిగిలిపోతున్నాయని పెళ్లి ఇంట వారు చెబుతున్నారు.