Anaparthy High Tension : తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఉద్రిక్తత నెలకొంది. అనపర్తి దేవీ చౌక్ వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు సభకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ టీడీపీ కార్యకర్తలు ముందుకు వెళ్లారు. తూర్పుగోదావరి జిల్లాలో మూడు రోజులుగా చంద్రబాబు పర్యటిస్తున్నారు. చంద్రబాబు సభకు వెళ్లకుండా కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. సభకు అనుమతి తీసుకున్నా పోలీసులు ఇలా ప్రవర్తించడం సరికాదని టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. చంద్రబాబు సభకు అనుమతి ఇచ్చి ఇప్పుడు పర్మిషన్ లేదంటూ చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. ఇప్పటికిప్పుడు సభాస్థలి మార్చుకోవాలని చెబుతున్నారని, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడుతున్నారు. జిల్లాలో ఎక్కడా లేని ఆంక్షలు ఇక్కడే ఎందుకని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావడంతో అనపర్తి దేవీ చౌక జనసంద్రంగా మారింది.  


చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు 


 అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం ఇల్లపల్లి జోడునాదాల వద్ద చంద్రబాబు నాయుడుకు టీడీపీ కార్యకర్తలు, నేతలు ఘనస్వాగతం పలికారు.  బిక్కవోలు గ్రామం నల్లమిల్లి రోడ్డు వద్ద చంద్రబాబు కాన్వాయ్ ను పోలీసులు అడ్డగించేందుకు ప్రయత్నించారు. పోలీసులను బ్యారికేడ్లను తోసుకుంటూ చంద్రబాబు కాన్వాయ్ ను టీడీపీ కార్యకర్తలు ముందుకు నడిపారు. మరికాసేపట్లో అనపర్తి మెయిన్ రోడ్ లో జరిగే సభలో చంద్రబాబు ప్రసగించనున్నారు. మెయిన్ రోడ్ లో చంద్రబాబు సభకు అనుమతి లేదంటూ పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను తోసుకుంటూ భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు సభాస్థలికి చేరుకున్నారు.  అనపర్తిలో సభ అనంతరం రామవరం గ్రామంలో మాజీ శాసనసభ్యుడు నల్లమిల్లి మూలారెడ్డి విగ్రహాన్ని  చంద్రబాబు నాయుడు ఆవిష్కరించనున్నారు. 






బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం వద్ద రోడ్డుకు అడ్డంగా పోలీసు వాహనం నిలిపి చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసులు రోడ్డుపై కూర్చొని కాన్వాయ్ ను ముందుకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంంటున్నారు.  చంద్రబాబు కాన్వాయ్ ను అనపర్తికి వెళ్లకుండా పోలీసు కానిస్టేబుళ్లు రోడ్డుపై కూర్చొన్నారు. దీంతో భలబద్రాపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అలాగే పోలీసులు రోడ్డుకు అడ్డంగా వాహనం పెట్టడంతో చంద్రబాబు పాదయాత్రగా అనపర్తికి బయలుదేరారు.  






చంద్రబాబు సభకు అనుమతి నిరాకరణ 


తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో మరోసారి వివాదం నెలకొంది. సభలకు పోలీసులు అడ్డుతగులుతున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు.  అనపర్తిలో చంద్రబాబు నిర్వహించబోయే సభకు అనుమతి రద్దు చేశారని నేతలు మండిపడుతున్నారు. గురువారం సభకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి నిరాకరిస్తూ శుక్రవారం నోటీసులు జారీ చేశారంటున్నారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ టీడీపీ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు. గురువారం రోజే ఈ సభకు జిల్లా కలెక్టర్, ఎస్పీలు అనుమతి ఇచ్చారని చెబుతున్నారు. సడెన్‌గా సభకు అనుమతిని నిరాకరిస్తున్నట్లు ఈరోజు నోటీసులు జారీ చేశారని వాపోతున్నారు. చంద్రబాబు సభ నిర్వహించే ప్రాంతం అత్యంత రద్దీ ప్రాంతమని, ఐదు వేలకు మించి ప్రజలు పట్టే అవకాశం లేదంటూ నోటీసుల్లో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈనెల 15, 16 తేదీల్లో రాజమహేంద్రవరం, జగ్గంపేట, పెద్దాపురంలో భారీ స్థాయిలో జనం తరలివచ్చి చంద్రబాబు సభకు నీరాజనం పలికారని చెబుతున్నాయి.  


అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి 


అనపర్తిలో జరిగే భారీ బహిరంగ సభ అనుమతి కోసం మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి నేరుగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీకి లేఖ రాశారు. దీంతో చంద్రబాబు సభకు కలెక్టర్, ఎస్పీలు అనుమతులు జారీచేశారు. అనుమతులు రావడంతో టీడీపీ శ్రేణులు సభ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ రోజు సభ కోసం పోలీసులు నోటీసులు జారీ చేయడంతో పార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే టీడీపీ సభలకు ఆటంకాలు కల్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే యువనేత లోకేశ్ పాదయాత్రకు చాలా ఆటంకాలు కల్గించారని, ఇప్పుడు అదే రీతిలో చంద్రబాబు యాత్రకు కూడా ఆటంకాలు కల్గించేలా కుట్ర చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడితున్నారు.