ప్రసవ సమయంలో కొన్ని క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు తల్లీ బిడ్డా క్షేమంగా ఉండేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. అయితే పరిస్థితులు చేయిదాటుతున్నప్పుడు తల్లినైనా.. లేదా పరిస్థితులకనుగుణంగా బిడ్డనైనా బతికించేందుకు ప్రయత్నిస్తారు. ఇక తల్లి బతికే అవకాశాలు దాదాపు లేవని తెలిస్తే కనీసం బిడ్డనైనా బతికించేందుకు సిజేరియన్ చేస్తుంటారు. అయితే దాదాపు కోమాలోకి వెళ్లిపోయిన ఓ మాతృమూర్తికి బిడ్డ ఏడుపుతో చలనం వచ్చిన అరుదైన ఘటన తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో చోటుచేసుకుంది. జిల్లాలోని కూనవరం మండలం టేకులబోరు ప్రాంతానికి చెందిన జోడె నాగమణి నిండుగర్భిణీ కాగా వచ్చే నెల నాలుగో తేదీకి ఆమెకు డెలివరీ టైం ఇచ్చారు. కానీ ఇంతలో నొప్పులు రావడంతో కూనవరం మండలం కోతులగట్టు పీహెచ్‌సీకు ఆమెను తీసుకెళ్లారు. 



Also Read: ఆయ్.. మా గోదారోళ్ళు ఇంతేనండీ.. 365 రకాల వంటలు.. కాబోయే మనవడికి, అల్లుడు గారికి మర్యాదలు మామూలుగా లేవుగా!


బిడ్డనైనా రక్షిద్దామని ఆపరేషన్ 


నాగమణికి పరీక్షలు నిర్వహించిన వైద్యసిబ్బంది ఆమె పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. ఇదే విషయాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ పుల్లయ్యకు సమాచారం అందించారు పీహెచ్‌సీ వైద్యుడు డాక్టర్‌ కోటిరెడ్డి. ఈ పరిస్థితుల్లో అప్పటికే గర్భిణీ నాగమణి కోమాలోకి వెళ్లిపోయింది. భద్రాచలం ఆసుపత్రిలో వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమెలో చలనం కనిపించకపోగా దాదాపు ఆమె మృతి చెందిందని వైద్యులు భావించారు. అయితే డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ పుల్లయ్య, పీహెచ్‌సీ వైద్యుడు డాక్టర్‌ కోటిరెడ్డి ఏరియా ఆసుపత్రికి తీసువెళ్లి కనీసం కడుపులో ఉన్న బిడ్డనైనా బయటకు తీస్తే బిడ్డ బతుకుతుందేమోనని భావించి భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరెంటెండ్‌ డాక్టర్‌ రామకృష్ణను ఒప్పించారు. 


Also Read: గోదారోళ్లా మజాకా... రూ.3.6 లక్షలు పలికిన పందెం పుంజు.... ఈసారి తగ్గేదేలే అంటున్న పందెంరాయుళ్లు


బిడ్డ ఏడుపుతో స్పృహ


గర్భిణీ నాగమణి సోదరుడు జోడె నాగేశ్వరరావు, భర్త సత్యనారాయణ అనుమతితో గైనకాలజిస్టు నరసయ్య, ఎనస్తీషియన్‌ కిషన్‌, ఐసీయూ సిబ్బంది ఆపరేషన్‌ చేసి మగబిడ్డను బయటకు తీశారు. ఇంతలో బిడ్డ ఏడుపు విని నాగమణిలో కదలికలు రావడంతో ఆశ్చర్యానికి లోనై హుటాహుటిన అత్యవసర వైద్యసేవలు అందించారు. తరువాత నాగమణి స్పృహలోకి వచ్చింది. ప్రస్తుతం తల్లి బిడ్డా క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. దాదాపు కోమాలోకి వెళ్లిపోయిన మాతృమూర్తి బిడ్డ ఏడుపు విని స్పృహలోకి రావడం చాలా అరుదని వైద్యులు చెబుతున్నారు. తల్లి బిడ్డలను రక్షించేందుకు వైద్యుల చేసిన కృషిని అధికారులు ప్రశంసిస్తున్నారు.  


Also Read:  చిన్నప్పుడు వేరుశనక్కాయలు కొని డబ్బులు ఇవ్వలేదని... ఇప్పుడు రూ.25 వేల ఆర్థిక సాయం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి