Uddanam : దుబాయ్‌లో ఆసియాకప్‌లో భాగంగా ఇండియా, పాకిస్తాన్ మధ్య హోరాహోరి ట్వీ20 పోరు జరుగుతోంది. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు భారత్ నుంచే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న భారతీయులకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మ్యాచ్ చూసేందుకు ఏపీ వాసులు కూడా వెళ్లారు. శ్రీకాకుళం జిల్లా కవిటికు చెందిన పుల్లట రామ్‌కుమార్‌ యూఏఈలో ఉంటున్నారు. భారత్‌, పాకిస్థాన్‌కు మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఆయన తన స్వస్థలం ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను వివరిస్తూ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు మాట్లాడారు. 




ఉద్దానం కిడ్నీ వ్యాధి సమస్యలు


శ్రీకాకుళం జిల్లా ఉద్దానం పేరు చెప్పగానే కిడ్నీ వ్యాధులే గుర్తొస్తాయి. అయితే ఉద్దానం చూడడానికి కోనసీమ ప్రాంతంలా ఎంతో పంచదనంతో ఉంటుంది.  కానీ ఈ ప్రాంతాన్ని కిడ్నీ సమస్యలు వేధిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట, పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాలను కలిపి ఉద్దానంగా పిలుస్తారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న దాదాపు లక్షమంది జనాభాలో 35 శాతం మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో దాదాపు 21 శాతం మంది 10 ఏళ్లకు పైగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని ఉద్దానంపై పరిశోధనలు చేసిన జార్జ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ తెలిపింది.


క్రియాటినిన్ శాతం 25 పైగా 


ఈ సంస్థ పరిశోధనలో రక్తంలోని సిరం క్రియాటినిన్ 1.2 మి.గ్రా/డెసీలీటర్ కంటే ఎక్కువగా ఉంటే కిడ్నీలు సరిగా పనిచేయడంలేదని తెలిసింది. ఉద్దానం ప్రాంతంలో సీరం క్రియాటినిన్ పాయింట్లు  25 మి.గ్రా/డెసిలీటర్ కూడా ఉన్నాయని గుర్తించారు. క్రియాటినిన్ 5 దాటితే వారికి డయాలసిస్ చేయాల్సిఉంటుందని వైద్యులు తెలిపారు. క్రియాటినిన్ పాయింట్లను బట్టి బాధితులు వారానికి రెండు, మూడుసార్లు కూడా డయాలసిస్‌ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది.


రూ. 10 వేల ఆర్థిక సాయం 


శ్రీకాకుళం జిల్లాలోని పలాస, టెక్కలి, శ్రీకాకుళం, సోంపేట, కవిటి, పాలకొండలలో కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో కిడ్నీ బాధితులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలపై ఎప్పటి కప్పుడు పరిశోధనలు చేసి బాధితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. డయాలసిస్  బాధితుల కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. కిడ్నీ బాధితులకు ఏపీ ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ భరోసా పేరుతో రూ. 10 వేలు ఆర్థిక సాయం అందిస్తుంది. వ్యాధి తీవ్రత, క్రియాటినిన్ స్థాయి వంటి లెక్కలు, ఇతర నిబంధనలతో చాలా తక్కువ మందికి సాయం అందుతోందని బాధితులు ఆవేదన చెందుతున్నారు.  ఈ వ్యాధికి గురైన వారిలో కిడ్నీలు 35 నుంచి 50 శాతం పాడవుతాయని, తర్వాత 80 శాతం వరకు, ఆ తర్వాత కిడ్నీలు పనిచేయడం మానేస్తాయని వైద్యులు అంటున్నారు. దీంతో వీరికి డయాలసిస్ తప్పనిసరి అవుతోందని అంటున్నారు. 


Also Read : Vinayaka Chaviti 2022 : గణేష్ మండపాల చుట్టూ ఏపీ రాజకీయాలు, ఇంతకీ అనుమతి తీసుకోవాలా? వద్దా?


Also Read : Ganesh Chaturthi 2022 : గణేష్ మండపాల ఏర్పాటుకు రుసుం చెల్లించక్కర్లేదు- ఏపీ దేవాదాయ శాఖ