ఆసియా కప్ లో భాగంగా నేడు జరగబోతున్న భారత్- పాకిస్థాన్ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. వికెట్ కీపర్ గా పంత్ కు బదులు దినేశ్ కార్తీక్ వైపే రోహిత్ మొగ్గుచూపాడు. 


ఆసియా కప్ లో చివరి మూడు మ్యాచుల్లో పాకిస్థాన్ పై భారత్ విజయం సాధించింది. 2016లో ఒకసారి, 2018 లో 2 సార్లు పాక్ ను టీమిండియా ఓడించింది. ప్రస్తుతం జరిగే ఆసియా కప్ లో ఈ రెండు జట్లు 3 సార్లు తలపడే అవకాశం ఉంది. ఈరోజు జరిగే లీగ్ మ్యాచ్ కాక.. సూపర్ 4 కు అర్హత సాధిస్తే అక్కడ రెండోసారి, ఫైనల్ కు చేరుకుంటే అక్కడ మూడోసారి దాాయాదులు తలపడనున్నారు. 


ఫామ్ లేమితో సతమతమవుతున్న భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇది వందో టీ20 మ్యాచ్. ఒకవేళ అతడు తుది జట్టులో ఉంటే మూడు ఫార్మాట్లలో వంద మ్యాచ్ లు ఆడిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సాధిస్తాడు. ఆసియా కప్ లో పాకిస్థాన్ పై అత్యధిక పరుగులు (183) చేసిన ఆటగాడు కోహ్లీనే కావడం గమనార్హం. 2012 లో అతడు ఈ ఘనత సాధించాడు. 


ఆసియా కప్ లో రెండు జట్లను గాయాలు వదల్లేదు. భారత్ తన స్టార్ ప్లేయర్ బుమ్రాను కోల్పోగా.. పాక్ జట్టుకు షహీన్ అఫ్రీది దూరమయ్యాడు. ఈ రోజు మ్యాచ్ జరిగే దుబాయ్ వేదికపైనే గత టీ20 ప్రపంచకప్ లో భారత్- పాక్ తలపడ్డాయి. ఆ మ్యాచ్ లో భారత్ పై పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇప్పటివరకు ఇరు జట్లు 9 టీ20ల్లో తలపడగా.. భారత్ 6 మ్యాచుల్లో, పాక్ రెండింటిలో విజయాలు సాధించాయి. మరొక మ్యాచ్ ఫలితం తేలలేదు. 


టీమిండియా తుదిజట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్


పాకిస్తాన్ తుదిజట్టు
బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఫకార్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్‌దిల్ షా, ఆసిఫ్ అలీ, షాదబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, నసీం షా, హరీస్ రవూఫ్, షానవాజ్ దహానీ