Drone Fly On Janasena Office: మంగళగిరిలోని (Mangalagiri) జనసేన కేంద్ర కార్యాలయంపై డ్రోన్ ఎగిరిన వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనిపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు ఆ డ్రోన్ ప్రభుత్వానిదేనని తేల్చారు. ఏపీ ఫైబర్ నెట్ సంస్థకు చెందిన డ్రోన్‌గా గుర్తించిన పోలీసులు.. సర్వేలో భాగంగానే కార్యాలయంపై డ్రోన్ ఎగిరినట్లు తేల్చారు. ట్రాఫిక్, పారిశుద్ధ్య కాల్వల నిర్వహణ, రహదారుల స్థితిగతులపై ప్రభుత్వం అధ్యయనం చేపడుతోంది. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో అధ్యయనం చేస్తుండగా.. పలు రకాల సర్వేలకు డ్రోన్లను వినియోగిస్తున్నారు.
మరోవైపు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) భద్రతకు సంబంధించి ప్రతీ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు (Dwaraka Tirumalarao) అన్నారు. రాజమహేంద్రవరంలో సోమవారం పెట్రోల్ బంకును ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు. మన్యంలో పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి పట్టుబడిన ఘటనలో పోలీస్ శాఖ వైఫల్యం లేదని పేర్కొన్నారు. 'పోలీసుల సంక్షేమం కోసమే పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నాం. ఈ బంకుల్లో కచ్చితమైన నాణ్యతా ప్రమాణాలు ఉంటాయి. ప్రజలు ఈ బంకుల్లో పెట్రోల్ కొట్టించుకుని పోలీస్ శాఖకు సహకరించాలి. గతం కంటే ఈసారి కోడి పందేలు ఎక్కువగా జరిగిన విషయం నా దృష్టికి రాలేదు. పందేలకు సంబంధించిన కేసులైతే ఎక్కువగానే నమోదు చేశాం.' అని పేర్కొన్నారు.
ఇదీ జరిగింది
కాగా, మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంపై శనివారం డ్రోన్ ఎగిరింది. ఈ మేరకు పార్టీ నాయకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు విచారించి పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలో శాంతి భద్రతల అదనపు ఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ, మంగళగిరి టౌన్ సీఐ వినోద్ ఘటన జరిగిన రోజునే జనసేన కార్యాలయంలో సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. రెండ్రోజుల లోతైన దర్యాప్తు అనంతరం అది ప్రభుత్వానికి చెందిన డ్రోన్‌గా గుర్తించారు.
Also Read: RaghuRama plea on Jagan: జగన్‌పై రఘురామకృష్ణ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం