రఘురామకృష్ణరాజు పిటిషన్లపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ మాజీ సీఎం, వైకాపా అధ్యక్షుడు వైఎస్​ జగన్‌ మోహన్​ రెడ్డి బెయిల్‌ రద్దు, కేసుల ట్రయల్‌ విచారణ ధర్మాసనం మార్పు చేయాలని కోరుతూ ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు రిజిస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో విచారించిన జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ ధర్మాసనం నుంచి కేసును బదిలీ చేసింది. జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ ధర్మాసనానికి మార్చింది. 


12 ఏళ్లుగా ట్రయల్‌ అడుగు ముందుకు కదల్లేదు
ఈ నేపథ్యంలో కొత్త ధర్మాసనం ముందు రఘురామ, జగన్‌, సీబీఐ తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. రఘురామకృష్ణ తరఫు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. గత 12 ఏళ్లుగా ట్రయల్‌ అడుగు కూడా ముందుకు కదల్లేదని, ఒక్క డిశ్ఛార్జ్‌ అప్లికేషన్‌ కూడా డిస్పోజ్‌ చేయలేదని బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంలో సీబీఐ, నిందితులు కుమ్మక్కయారని వెల్లడించారు. డిశ్ఛార్జ్‌ పిటిషన్లపై వాదనలు విని ఎలాంటి నిర్ణయం వెలువరించకుండానే ఐదుగురు జడ్జీలు బదిలీ అయ్యారని.. ఒక్క డిశ్ఛార్జ్‌ అప్లికేషన్‌పైనా తుది నిర్ణయం వెలువడకుండా బదిలీ కావడంలో కుట్రకోణం దాగి ఉందన్నారు. తాము ట్రయల్‌ బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశామని పేర్కొన్నారు. అయితే బదిలీ సాధ్యం కాదని ధర్మాసంన గత విచారణలోనే చెప్పిందన్నారు. ట్రయల్ బదిలీపై పిటిషన్ వేశామని ఇప్పుడు ఆ రెండింటినీ తాము కోరట్లేదని.. కేసు మానిటరింగ్‌ పూర్తిస్థాయిలో జరగాలని కోరుతున్నామని అన్నారు. 


వచ్చే సోమవారానికి వాయిదా
సీబీఐ కేసుల వివరాలు, ప్రస్తుత పరిస్థితిపై అఫిడవిట్ దాఖలు చేసిందని దర్యాప్తు సంస్థ న్యాయవాది తెలిపారు. కేసును హైకోర్టు మానిటర్ చేస్తోందని, ఇంకా పెండింగ్‍లో ఉందని జగన్ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ పేర్కొన్నారు. గత పదేళ్లుగా ట్రయల్ జాప్యం కొనసాగుతూనే ఉందని రఘురామ తరఫు న్యాయవాది చెప్పగా.. కేసులో వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలన్న సీబీఐ తరఫు న్యాయవాది కోరారు. ఏఎస్‍జీ మరో కేసులో వాదనలు వినిపిస్తోందని, అందుకే వాయిదా వేయాలని సీబీఐ న్యాయవాది విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ సతీశ్‌ చంద్రశర్మ బెంచ్​.. ఈ అంశంపై వచ్చే సోమవారం విచారణ చేపడతామని తెలిపింది.