Driver Subrahmanyam Murder Case: తమ కొడుకు హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు సత్యనారాయణ, నూకరత్నం డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేయడం, ఆపై కొంతకాలానికి బెయిల్ మీద రావడం తెలిసిందే. డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. అనంతబాబు తమ కొడుకును దారుణంగా చంపారని డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు నూకరత్నం, సత్యనారాయణ ఆరోపించారు. ఒంటి నిండా గాయాలున్నా పోలీసులు కేసు నీరు గార్చాలని చూశారని.. కేసును సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు.
నిందితుడికి శిక్ష పడాలి
తమ కొడుకును చంపిన అనంతబాబుకు శిక్షపడాలని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. శిక్షపడే వరకు పోరాడుతామన్నారు. కూటమి ప్రభుత్వంలో తమకు న్యాయం లభిస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. కాకినాడ పోలీసులు అనంతబాబుకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. కేసును వదిలేయాలని గతంలో అనంత బాబు అనుచరులు మమ్మల్ని బెదిరించారని చెప్పారు. ఈ కేసు విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తామన్నారు. తమ కొడుకు కేసు విషయంలో న్యాయవాది సుబ్బారావు చాలా సహాయం చేశారని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు తెలిపారు.
సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిర్లక్ష్యం
దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసును తిరిగి విచారించాలని ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు కోరారు. విధుల నిర్వహణలో అలసత్వానికి పాల్పడిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సుబ్రహ్మణ్యం ఒంటినిండా గాయాలు ఉన్నా అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారని ఆరోపించారు. సంఘటన జరిగిన సమయంలో అనంతబాబు గన్ మ్యాన్ ఎక్కడికి వెళ్లాడు.. సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇంకా చాలామంది ఉన్నారని సుబ్బారావు అనుమానం వ్యక్తం చేశారు. కానీ అనంతబాబు ఒక్కరి మీదే కేసు నమోదు చేశారు. ఒక వ్యక్తి అన్ని గాయాలు చేయడం అసంభవం అన్నారు. వైసీపీ అడుగు జాడల్లో నడిచిన పోలీసు అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ఆ కుటుంబ బాధ్యత ప్రభుత్వానిదే
అనంతబాబు సహజ వనరులను దోచుకున్నారని సుబ్బారావు ఆరోపించారు. ఆ వైసీపీ నేత చేసిన అక్రమాలకు అధికారులంతా సహకరించారన్నారు. చట్ట ప్రకారం బాధితుడికి అందాల్సిన ఆర్థిక సహాయం కూడా ఇంకా అందలేదన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం మీద ఆధారపడి బ్రతికే వారికి పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఆదుకోవలసిన బాధ్యత ప్రస్తుతం ప్రభుత్వం పై ఉందన్నారు. అనంతబాబు హత్య కేసులో విచారణ నిష్పక్షపాతంగా చేయలేదన్నారు. అనంత బాబు పై రౌడీషీట్ ఉన్నా గతంలో ఎటువంటి కేసులు లేవని పోలీసులు కేసు నమోదు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మించిన అక్రమాలు, నేరాలు అనంతబాబు చేశారని సుబ్బారావు తెలిపారు.