RGVs Vyuham Movie pre release event in Vijayawada: ఏపీ వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రతిబింబిస్తూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Director Ramgopal varma) తీసిన మూవీ "వ్యూహం". రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన వ్యూహం సినిమా (Vyuham Movie Release Date) డిసెంబర్ 29న విడుదల కానుంది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా, వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. ఈ క్రమంలో వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహించారు.


సైకిల్ పార్టీ షేకయిపోయింది: మంత్రి రోజా 
ఆర్జీవీ అంటేనే ఒక సెన్సేషన్ అని, వ్యూహం సినిమా టైటిల్ అనౌన్స్ చేయగానే, సైకిల్ పార్టీ షేకయిపోయిందన్నారు మంత్రి రోజా. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రోజా మాట్లాడుతూ.. ఎప్పుడైతో వ్యూహం టీజర్ వచ్చిందో చంద్రబాబుకు చెమటలు పట్టాయని, ట్రైలర్ తో లోకేష్ పరుగులు పెట్టాడన్నారు. చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు, జగన్ అన్న పడిన సంఘర్షణకు రూపమే వ్యూహం సినిమా అని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ లా.. రాజకీయ నాయకుడిగా చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు వ్యూహం సినిమాతో ఈ తరంతో పాటు వచ్చే తరానికీ తెలుస్తాయన్నారు.


రాంబాబును రాంబాబులాగే చూపించే దర్శకుడు వర్మ.. 
ఏపీ సీఎం జగన్ రాజకీయ ప్రస్థానం విషాదంతో మొదలై విజయంతో కొనసాగుతోందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జగన్ రాజకీయ సంఘర్షణను దర్శకుడు ఆర్జీవీ వ్యూహం సినిమాగా రూపొందించారని, నిజాయితీగా నిర్భయంగా వ్యూహం తీశారని కితాబిచ్చారు. శ్యామ్ బాబు పేరుతో తన క్యారెక్టర్ ను పవన్ సినిమాలో పెట్టారని... కానీ వర్మ మాత్రం రాంబాబును రాంబాబులాగే చూపిస్తాడని, చంద్రబాబును చంద్రబాబులాగే చూపిస్తాడని చెప్పారు. అత్యంత ప్రజాదరణ కలిగిన నేత జగన్ ను ఓడించాలని చూసే ఏ శక్తి అయినా మట్టి కరవక తప్పదన్నారు.


ఎన్నో కుట్రలు, చెడు వ్యూహాలను తన శక్తి యుక్తులతో ఎదుర్కొన్ని విజేతగా నిలబడ్డ నాయకుడు జగన్ అని మంత్రి జోగి రమేష్ అన్నారు. జగన్ అంటే మంచితనం, మనసున్న వ్యక్తి అని ప్రతి ఒక్కరికీ తెలుసునని.. ఆయన జీవితాన్ని వ్యూహం సినిమా ద్వారా చూపించాలని ఆర్జీవీ చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. వ్యూహం సినిమా రిలీజ్ కాకముందే చంద్రబాబు, లోకేష్ లో భయం పుట్టుకుందని.. ఈ సినిమా రిలీజ్ ను ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు.


వర్మ మరిన్ని సినిమాలు తీయాలి.. 
"వ్యూహం" సినిమా ఈవెంట్ విజయవాడలో చేయడం హ్యాపీగా ఉందన్నారు వైసీపీ ఎంపీ నందిగం సురేష్. ఈ సినిమా ద్వారా జగన్ గురించి నిజాలు ప్రజలకు చెప్పాలని దర్శకుడు ఆర్జీవీ ప్రయత్నం చేశారని చెప్పారు. దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ సంచలనమే. ఆయన శివ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ శివ ముందు శివ తర్వాత అనేంత మారిపోయింది. వ్యూహం లాంటి సినిమాలు వర్మ మరిన్ని తీయాలని ఆకాంక్షించారు. ఏపీ ప్రజలు వ్యూహం సినిమా చూడాలని కోరుకుంటున్నారని నందిగం సురేష్ అన్నారు. 


వైఎస్సార్ మరణం నుంచి నేటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి కుట్ర రాజకీయాలు సాగుతున్నాయి అనేది మనం పేపర్స్ లో చదివాం, దర్శకుడు వర్మ ఆ విషయాలను సినిమాలో చూపించారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కుట్ర రాజకీయాల గురించి ప్రజలకు వ్యూహం ద్వారా తెలియాలి. ఈ సినిమా రిలీజ్ ను అడ్డుకునేందుకు కొందరు కోర్టులకు వెళ్లి స్టే ఆర్డర్స్ తెచ్చే ప్రయత్నం చేసినా.. వ్యూహం రిలీజ్ ను ఆపలేరని పేర్కొన్నారు. "వ్యూహం" సినిమా ట్రైలర్ రిలీజ్ కాగానే కొందరు భయపడి కోర్టులకు వెళ్తున్నారంటేనే మూవీ విజయం కన్ఫామ్ అన్నారు ఎమ్మెల్యే ఆదీప్ రాజ్. అందరూ సినిమా చూడాలన్నారు. 


వ్యూహం ఎంతో ఇన్ స్పైరింగ్ గా ఉంటుందన్న అంబటి రాయుడు
ఏపీ సీఎం జగన్ జీవితం ఆధారంగా వ్యూహం సినిమాను రూపొందించిన దర్శకుడు వర్మకి క్రికెటర్ అంబటి రాయుడు థ్యాంక్స్ చెప్పాడు. ఈ సినిమా ఎంతో ఇన్ స్పైరింగ్ గా ఉంటుందని ఆశించారు. 2024లో జగన్ ను మరోసారి సీఎం చేసేందుకు కలిసి రావాలన్నారు. వ్యూహంతో జగన్ మీద చేసిన దుష్ప్రచారాల వెనక దాగి ఉన్న నిజాలు తెలుస్తాయన్నారు. 


ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ - రాజకీయాల్లో భయం లేని నాయకుడు జగన్. అలాగే సినిమా ఇండస్ట్రీ భయం లేని దర్శకుడు ఆర్జీవీ. వ్యూహం ట్రైలర్ రిలీజ్ కాగానే చంద్రబాబు, లోకేష్, పవన్ భయపడ్డారు. తమ గురించి నిజాలు తెలుస్తాయని వాళ్ల భయం. వర్మను భయపెట్టాలని చూశారు. ఆయన ముంబై మాఫియాకే భయపడలేదు వీళ్లకు భయపడతాడా. వ్యూహం సినిమా పెద్ద హిట్ కావాలన్నారు.‘ఆర్జీవీ మూవీ వ్యూహంతో చంద్రబాబుకు చెమటలు, లోకేష్ పరుగులు’