Mumbai Indians Captain Hardik Pandya: ఢిల్లీ: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పించిన తరువాత తెరవెనుక పెద్ద వివాదమే జరిగింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించిన తరువాత జట్టులో అంతర్గతంగా సైతం ఈ నిర్ణయం ఎవరికీ రుచించలేదు. పైగా ఫ్యాన్స్ అయితే భారీ స్థాయిలో సోషల్ మీడియా ఖాతాల్లో ముంబై ఇండియన్స్ ను అన్ ఫాలో చేశారు. తాజాగా మరో షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఐపీఎల్ 2024 (IPL 2024)కు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అందుబాటులో (Hardik Pandya to Miss IPL 2024) ఉండేది కష్టమే. ఐపీఎల్ 17 సీజన్ లో ముంబై సారథిగా ఎవరు ఉంటారని చర్చ మొదలైంది. ఇందు కారణంగా హార్దిక్ పాండ్యా గాయం నుంచి ఇంకా కోలుకోలేదని ఆంగ్ల మీడియాలో కథనాలు వచ్చాయి.


రోహిత్ శర్మ కారణంగా ముంబై ఇండియన్స్ 5 ఐపీఎల్ ట్రోఫీలు నెగ్గింది. అదే సమయంలో రోహిత్ తో పాటు, ముంబై ఫ్రాంచైజీకి ప్రతి ఏడాది ఫ్యాన్ బేస్ పెరిగింది తప్ప తగ్గలేదు. కానీ రోహిత్ లాంటి సారథని తప్పించి హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా ప్రకటించింది ముంబై ఇండియన్స్ మేనేజ్ మెంట్. కానీ వచ్చే సీజన్ కు పాండ్యా అందుబాటులో ఉండటంపై ఏ స్పష్టత లేదు. వన్డే వరల్డ్ కప్ నుంచి గాయం కారణంగా తప్పుకున్న హార్దిక్ పాండ్యా ఇంకా కోలుకోలేదు. ఐపీఎల్ 2024 సమయానికి సైతం అతడు కోలుకునే అవకాశాలు చాలా తక్కువ అని, ముంబై కెప్టెన్ గా రోహిత్ శర్మనే వ్యవహరిస్తాడా అనేది ప్రశ్నార్థకంగా మారింది. రోహిత్ తో సరిగ్గా చర్చలు జరపకుండా ముంబై కెప్టెన్సీ నుంచి తప్పించింది. ఇప్పుడు పాండ్యా లేడని, రోహిత్ మరోసారి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టడం దాదాపుగా కష్టమే.  


పాండ్యా కోలుకోకపోతే కెప్టెన్ ఎవరంటే..
తాజా రిపోర్టుల ప్రకారం ఒకవేళ కెప్టెన్ పాండ్యా గాయం నుంచి కోలుకోకపోతే సూర్యకుమార్ యాదవ్ లేక పేసర్ బుమ్రాలలో ఒకరు ముంబై ఇండియన్స్ సారథిగా వ్యవహరించే ఛాన్స్ ఉంది. పాండ్యాను కెప్టెన్ గా ప్రకటించగానే బుమ్రా అయితే హార్ట్ బ్రేక్ అయినట్లు ఎమోజీలు పోస్ట్ చేయడం తెలిసిందే. మరోవైపు కెప్టెన్ గా రోహిత్ కాకుంటే, తనకు ఛాన్స్ ఉంటుందని సూర్య రేసులోకి వస్తాడని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం.


ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్, రోహిత్ ఫ్యాన్స్ అయితే హిట్ మ్యానే తమకు కెప్టెన్ అని.. వేరొకరికి ఛాన్స్ ఇవ్వొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు.