రోహిత్‌ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ ముంబై మేనేజ్‌మెంట్‌ తీసుకున్న నిర్ణయంతో అభిమానులు భగ్గుమంటున్నారు. ఎక్స్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ముంబై ఇండియన్స్ ఖాతాను ఆన్‌ఫాలో చేసేస్తున్నారు. గంటల వ్యవధిలోనే ముంబై ఇండియన్స్ భారీగా ఫాలోవర్లను కోల్పోయింది. ఎక్స్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలమంది ముంబైను అన్‌ఫాలో చేస్తున్నారు. ముంబైకి ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన రోహిత్‌ను ఆడుతుండగానే ఎలా కెప్టెన్సీ నుంచి తప్పిస్తారంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నలు గుప్పిస్తున్నారు. అయితే కెప్టెన్సీ మార్పుతో ముంబై ఇండియన్స్‌ జట్టులో అభిప్రాయ భేదాలు మొలయ్యాయని... సీనియర్‌ ఆటగాళ్లు జట్టును వీడేందుకు సిద్ధమయ్యారంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కెప్టెన్సీ మార్పుతో సీనియర్లు ఫ్రాంచైజీని వీడతారనే రూమర్లు ముంబయి ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌ను కలవరానికి గురిచేశాయి. 

 

రోహిత్‌ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి హార్దిక్‌ పాండ్యాను కెప్టెన్‌ చేయడంపై సీనియర్‌ క్రికెటర్లు జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌తోపాటు ఇషాన్‌ కిషన్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. వీరు ముగ్గరూ ముంబయి ఇండియన్స్‌ జట్టు బయటకు వచ్చేస్తారనే వార్తలు హల్‌చల్‌ చేశాయి. పాండ్య నాయకత్వంలో తాము ఆడేది లేదని తేల్చి చెప్పినట్లూ కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలు ఎంతకీ ఆగక పోవడంతో ముంబై ఇండియన్స్‌ కూడా స్పందించాల్సి వచ్చింది. సీనియర్‌ ఆటగాళ్లు జట్టను వీడతారనేవి నిరాధారమైన ఆరోపణలని ముంబయి ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్ కొట్టిపడేసింది. అసలు ఇలాంటి ప్రచారం ఎలా మొదలవుతుందో అర్థం కావడం లేదని... ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవమని ముంబై ఇండియన్స్‌ తేల్చి చెప్పింది. ఏ ఆటగాడు ముంబయి ఇండియన్స్‌ను వీడటంలేదని... తాము ఇక ఎవరినీ కొనుగోలు చేయడం లేదని స్పష్టం చేసింది. కెప్టెన్సీ మార్పుపై రోహిత్‌ శర్మకు తెలుసని.... ఈ నిర్ణయంలో అతడూ భాగస్వామే’అని ముంబయి ఇండియన్స్‌ స్పష్టం చేసింది. రోహిత్ విషయంలో ఆందోళన వద్దని... అతను ముంబై జట్టుతో పాటు బరిలోకి దిగుతాడని ముంబై సహ యజమాని ఆకాశ్‌ అంబానీ స్పష్టం చేశాడు. 

 

మరోవైపు ముంబై జట్టులోని ప్రతి ఒక్కరితో చర్చించాకే హార్దిక్‌ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించామని ముంబై ఇండియన్స్‌ కోచ్‌ మార్క్‌ బౌచర్ వ్యాఖ్యానించాడు. ముంబై జట్టులోని ప్లేయర్లతో... కోచింగ్‌ సిబ్బందితో కెప్టెన్సీ విషయంపై చర్చించామని బౌచర్‌ వెల్లడించాడు. క్రికెట్‌లో ఇలాంటివి సర్వసాధారణమని... భవిష్యత్తు కోసం ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్ ఆలోచించిందని మార్క్‌ బౌచర్‌ తెలిపాడు. రోహిత్‌ నాయకత్వంలో అద్భుతమైన ఘనతలను సాధించామని.. జట్టులో అతడు వీరుడులాంటి వాడని ముంబై కోచ్‌ పొగడ్తల వర్షం కురిపించాడు. జట్టు భవిష్యత్తు కోసం ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. అభిమానుల భావోద్వేగాలను తాము అర్థం చేసుకోగలమని.... ఇక ఆటగాళ్లు జట్టును వీడుతున్నారనేదానిపై తాను స్పందించబోనని బౌచర్‌ అన్నాడు. 

 

ముంబై ఇండియన్స్‌లో జరిగిన ఈ పరిణామాలపై ఇటీవలే దిగ్గజ ఆటగాడు సునీల్‌ గవాస్కర్‌ స్పందించాడు. ముంబై ఇండియన్స్‌ నయా కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా.. జట్టును కొత్త ఆలోచనలతో ముందుకు తీసుకెళ్తాడని క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ అన్నాడు. కొన్నేళ్లుగా బ్యాటింగ్‌లో రోహిత్‌శర్మ ప్రదర్శన తగ్గిందని తెలిపాడు. ముంబై కెప్టెన్‌గా హార్దిక్‌ నియామకం సరైనదా.. కాదా... అని చూడాల్సిన అవసరం లేదని గవాస్కర్‌ అన్నాడు. జట్టుకు ప్రయోజనం చేకూర్చడం కోసమే ముంబై యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని... జట్టు ప్రదర్శన కూడా పడిపోయిందని గుర్తు చేశాడు.