కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వరుసగా రెండో రోజూ వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారో అధికారులు ప్రకటించలేదు. దీంతో టీడీపీ కౌన్సిలర్లు హాల్లోనే బైఠాయించారు. రెండో రోజు కూడా కౌన్సిల్ హాల్లో విధ్వంసం జరిగింది. దీంతో ఎన్నికల అధికారిక ఎంపిక ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. సోమవారం చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కుర్చీలు, బల్లులు విరగ్గొట్టి ఉద్రిక్తత సృష్టించడంతో ఎన్నికల అధికారి ఇవాళ్టికి చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు.
Also Read: త్వరలో మూడు రాజధానుల కొత్త బిల్లులు ... అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన !
ఆ తర్వాత కూడా సమావేశ మందిలోనే టీడీపీ కౌన్సిలర్లు, ఎంపీ కేశినేని నాని ఉన్నారు. వారిని రాత్రి సమయంలో అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. కానీ పోలీసులు తమ సభ్యుల్ని వైఎస్ఆర్‌సీపీ క్యాంప్‌కు తరలిస్తారన్న అనుమానంతో కేశినేని నాని సహా అందరూ స్వచ్చందంగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇంటికి వెళ్లారు. మళ్లీ ఉదయమే కొండపల్లి మున్సిపల్ ఆఫీసుకు చేరుకున్నారు. మొత్తం కొండపల్లి నగర పంచాయతీలో 29 వార్డులు ఉన్నాయి. ఇందులో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ చెరో 14 స్థానాలు గెల్చుకున్నాయి. ఓ స్థానాన్ని టీడీపీ రెబల్ అభ్యర్థి గెల్చుకున్నారు. అయితే వెంటనే ఆ కౌన్సిలర్ టీడీపీలో చేరిపోయారు. దీంతో టీడీపీ బలం 15కు చేరుకుంది.
Also Read: మండలిని రద్దు చేయవద్దు ..ప్లీజ్.. ! కేంద్రానికి ఏపీ ప్రభుత్వం మరో తీర్మానం !
ఎక్స్ అఫీషియో మెంబర్‌గా టీడీపీ ఎంపీ కేశినేని నానికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైకోర్టు అవకాశం కల్పించింది. వైఎస్ఆర్‌సీపీ తరపున ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఓటు హక్కు లభించింది. దీంతో బలాలు టీడీపీకి 16, వైఎస్ఆర్‌సీపీకి 15 తేలాయి. టీడీపీకి చైర్మన్ పీఠం లభించడం ఖాయం అయింది. అయితే కొండపల్లిని తామే గెల్చుకుంటామని వైఎస్ఆర్‌సీపీ నేతలు చెబుతూ వచ్చారు. ఆ ప్రకారం ప్రయత్నించినా సాధ్యం కాలేదు.