Ahobilam Matt Case : అహోబిలం మఠం కేసులో ఏపీ సర్కార్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అహోబిలం మఠం సాధారణ కార్యకలాపాలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధమని ధర్మాసనం ప్రశ్నించింది.  మఠాన్ని ఎందుకు చేజిక్కించుకోవాలనుకుంటున్నారని సుప్రీం ప్రశ్నించింది. ఆలయాలు, ధార్మిక క్షేత్రాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరికాదని సూచించింది. ఆలయాలను ధర్మకర్తలకే వదిలేయాలని ఆదేశించింది. అహోబిలం కేసులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మఠం కేసులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు  తోసిపుచ్చింది. మఠంలో ఈవో నియామకాన్ని తప్పుబడుతూ గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం...హైకోర్టు తీర్పును సమర్థించింది. 


దేవాలయాలను ధర్మకర్తలకే వదిలేయండి


కర్నూలులోని అహోబిలం ఆలయ వ్యవహారాలను నిర్వహించడానికి 'ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్'ని నియమించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 26(డి)ని ఉల్లంఘించడమేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. ప్రభుత్వం జోక్యం మఠాధిపతి పరిపాలనా హక్కును ప్రభావితం చేసేలా ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. జస్టిస్‌ ఎస్‌కే కౌల్, జస్టిస్ ఎ.ఎస్.ఓకా తో కూడిన ధర్మాసనం ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ విచారణ చేపట్టింది. అహోబిలం మఠం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవాలనుకుంటుందో అని ధర్మాసనం ప్రశ్నించింది.  ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.  “దేవాలయాలను వాటికి సంబంధించిన వాళ్లనే చూడనివ్వండి, మతపరమైన స్థలాలను మతపరమైన వ్యక్తులకు ఎందుకు వదిలివేయకూడదు?”  అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కేసులో సీనియర్ న్యాయవాదులు సతీష్ ప్రసరన్, సి.శ్రీధరన్, న్యాయవాది విపిన్ నాయర్ భక్తుల తరఫున కేవియట్‌గా హాజరయ్యారు.


హైకోర్టు తీర్పు 


తమిళనాడులో ఉన్న అహోబిలం మఠంలో ఈ ఆలయం అంతర్భాగమని ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ గతంలో స్పష్టం చేసింది. దేవాలయం, మఠం వేర్వేరు సంస్థలు అని రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన వాదనను హైకోర్టు తిరస్కరించింది. మఠం, ఆలయం వేర్వేరు భౌగోళిక ప్రదేశాలలో ఉన్నాయని, ఒకటి తమిళనాడులో మరొకటి ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్నందున, ఆలయం, మఠంలో భాగంగా కాదన్న వాదనను సమర్థించలేదమని కోర్టు తెలిపింది. చారిత్రాత్మక పుస్తకాలు, సాహిత్యం పురావస్తు డేటాను ప్రస్తావించిన కోర్టు... దేవాలయం, మఠాన్ని మఠాధిపతులు నిర్వహిస్తున్నారని హైకోర్టు స్పష్టం చేసింది. మఠం నిర్వహణ సాధారణ అధికారం రాష్ట్రానికి ఇస్తున్నామని, దాని వ్యవహారాల్లో తక్కువగా జోక్యం చేసుకోవాలని హైకోర్టు సూచించింది. అధికార దుర్వినియోగం సరికాదని తెలిపింది. ఆలయానికి ఈవో నియామకానికి హైకోర్టు తప్పుబట్టింది. 


వంశపారంపర్య ధర్మకర్తలు 


1927 ఎండోమెంట్స్ చట్టం ప్రకారం, ఆలయం మఠాధిపతుల నిర్వహణలో ఉందని, వీరి నామినేషన్ ప్రభుత్వానికి సంబంధం లేదని డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది.  ఏపీ ధార్మిక, హిందూ మతపరమైన సంస్థల్లో దేవాదాయ చట్టం ప్రకారం మఠం లేదా ఆలయానికి కార్యనిర్వాహక అధికారిని నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఆలయానికి వంశపారంపర్యం కానీ ధర్మకర్తలను నియమించే పద్ధతి లేదని 2014లో రాష్ట్ర ప్రభుత్వమే గుర్తించిందన్నారు.