CM Jagan : ప్రధాని మోదీ అధ్యక్షతన దిల్లీలో జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశంలో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రత్యామ్నాయ పంటల సాగు, నూనె, పప్పు పంటల సాగులో స్వయం సమృద్ధి, జాతీయ విద్యా విధానం, పట్టణాభివృద్ధి, కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకారంపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఏపీ పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రంగా మారిందన్నారు. 62 శాతం మంది జనాభా కేవలం వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 35 శాతంపైనే అని, ఈ విషయం దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు.  


వ్యవసాయ అవసరాలు తీర్చేందుకు ఆర్బీకేలు 


వ్యవసాయ రంగంలో ఉన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని రైతులను ఆదుకునేందుకు వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్, ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తున్నామన్నారు. సకాలంలో చెల్లించిన వారికి వడ్డీలేని రుణాలు, 9 గంటల పాటు ఉచిత కరెంటు కార్యక్రమాలను రైతులకు అమలు చేస్తున్నామన్నారు. రైతులకు అండగా నిలిచేందుకు ఏపీలో  10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు స్పష్టం చేశారు. వ్యవసాయ అవసరాలు తీర్చేందుకు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్నామన్నారు. 



ఆర్బీకే స్థాయిలో ఈ క్రాప్ బుకింగ్ 


డిజిటిల్‌ టెక్నాలజీని వినియోగించుకుంటూ సీఎం యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని సీఎం జగన్ తెలిపారు. పంటల కొనుగోలు ప్రక్రియను రోజువారీగా ఆర్బీకేల స్థాయిలో ఈ యాప్‌ ద్వారా నిరంతరం పరిశీలన, పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం తరఫున పంటల కొనుగోళ్లు చేస్తూ రైతులకు మద్దతు ధర కల్పిస్తున్నామన్నారు. ఆర్బీకే స్థాయిలోనే ఈ క్రాప్‌ బుకింగ్‌ కూడా చేస్తున్నామన్నారు. ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, వడ్డీలేని పంట రుణాలు, పంటల కొనుగోలు తదితర వాటిని సమర్థవంతంగా అమలుచేయడానికి ఈ క్రాప్‌ బుకింగ్‌ సాయపడుతోందన్నారు.  


జీఈఆర్ నిష్పత్తి పెంచేందుకు


చదువుకోవడం చిన్నారుల హక్కుగా ఏపీ ప్రభుత్వం గుర్తించి సుస్థిర ప్రగతి లక్ష్యాలతో అనుసంధానం చేసిందని సీఎం జగన్ అన్నారు. బడి మానేసే విద్యార్థుల శాతాన్ని పూర్తిగా నివారించి జీఈఆర్‌ నిష్పత్తిని పెంచేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక విద్యలో దేశ జీఈఆర్‌ నిష్పత్తి 99.21 శాతం అయితే ఏపీలో 84.48 శాతంగా ఉందన్నారు. తల్లిదండ్రుల పేదరికం పిల్లల చదువులకు ఆటంకం అవ్వకూడదని అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. అమ్మ ఒడి పథకానికి 75 శాతం హాజరు ఉండాలనే నిబంధనను కూడా అమలుచేస్తున్నామన్నారు.