MP Raghurama Krishna Raju : సీఎం జగన్ మోహన్ రెడ్డి, సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ గత ఏడాది తన పుట్టిన రోజు మరచిపోకుండా చేశారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఇవాళ ఎంపీ రఘురామకృష్ణరాజు 60వ పుట్టినరోజు. ఆయన శనివారం దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తన 59వ పుట్టిన రోజున తనకు జరిగిన అవమానాలు, అనుభవాలను గుర్తుచేసుకున్నారు. గత 18 ఏళ్లుగా తన మిత్రుడు రామానాయుడు పుట్టినరోజు జరిపేవారన్నారు. సీఐడీ చీఫ్ సునీల్‌ కుమార్ గోల్ఫ్ పేరుతో రెక్కీ నిర్వహించి తనను గత ఏడాది అరెస్ట్ చేయించారన్నారు. గుంటూరు సీఐడీ ఆఫీసులో కెమెరాలు తీసివేసి, వ్యక్తిగత సెక్యూరిటీని బయటకు పంపి దాడి చేశారన్నారు. సీఎం జగన్, సీఐడీ చీఫ్ సునీల్‌ కుమార్ కుట్రలు చేసి పోలీసులతో దాడి చేయించారని ఆరోపించారు. పోలీసులు తనపై దాడిని చేసి ఆ వీడియోలు సీఎంకు చూపించారన్నారు. 






సీఎం జగన్, సునీల్ కుమార్ అద్భుత కళాకారులు 


నిల్చొనే పరిస్థితి లేకుండా తనను తీవ్రంగా కొట్టారని ఎంపీ రఘురామ అన్నారు. ఆ పుట్టినరోజు ఆఖరిరోజు అవుతుందనే భయం కూడా వేసిందని ఆయన ఆవేదన చెందారు. తన గుండెలపై కూర్చొని కొట్టారని చెప్పారు. దాడి చేస్తూ దుర్భాషలు ఆడుతూ విచక్షణారహితంగా కొట్టారన్నారు. రాత్రి 11:45 గంటల నుంచి 12:10 గంటల వరకు ఇష్టం వచ్చినట్లు కొట్టారన్నారు. తనను పెట్టిన చిత్రహింసలు సినిమాలో కూడా ఆ విధంగా ఉండవన్నారు. సీఎం, సునీల్‌ కుమార్ ఇద్దరూ ఒకరిని మించిన కళాకారులని ఎంపీ అన్నారు. ఆ రోజు రాత్రంతా నిద్రలేకుండా చాలా భయాందోళనకు గురయ్యాని చెప్పారు. కాళ్లు వాచిపోయేంత వరకూ కొట్టారన్నారు. పోలీసులతో దాడి చేయించి ఆ తర్వాత రోజు తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. గత సంవత్సరం తన పుట్టినరోజును మరపురాని రోజుగా చేసిన వ్యక్తులకు ధన్యవాదాలు అంటూ ఎంపీ రఘురామ వ్యాఖ్యానించారు.


గత ఏడాది ఇదే రోజున అరెస్టు 


తన సెల్‌ఫోన్‌ కోసం వెతికి మొత్తం ఐదుసార్లు తనను తీవ్రంగా కొట్టారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఓ కానిస్టేబుల్‌ వచ్చి ఏం జరిగిందని, ఎవరు కొట్టారని అమాయకంగా నటించాడని, హెడ్‌ కానిస్టేబుల్‌ వచ్చి తనను మంచంపై పడుకోబెట్టారన్నారు. ఇవాళ తన 60వ పుట్టినరోజు అని ఎంపీ తెలిపారు. 59వ పుట్టినరోజు ఎంతో ఘనంగా జరిపిన ఉన్మాదికి తన ధన్యవాదాలు అన్నారు. 2024లో ప్రజాక్షేత్రంలో ప్రజలు బుద్ధి చెబుతారని ఎంపీ రఘురామ పేర్కొన్నారు. రఘురామకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్ లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌ పర్యటన తర్వాత అమిత్‌షాను కలవనున్నట్లు రఘురామకృష్ణరాజు తెలిపారు. గతేడాది ఇదే రోజు ఎంపీ రఘురామకృష్ణరాజును హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ అరెస్ట్‌ చేసింది. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాట్లాడుతున్నారని సీఐడీ అభియోగం మోపి అరెస్టు చేసింది.