Adinarayana Reddy : జగన్ మోహన్ రెడ్డికి సీఎం అయ్యానన్న తృప్తి లేదని బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన... వైఎస్‌ వివేకా హత్య వెనుక పెద్ద కుట్రే ఉందని ఆరోపించారు. సీబీఐ దర్యాప్తులో అన్ని బయటకు వస్తాయన్నారు.  ఈ కేసుకు సంబంధించి తమపై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. అసంతృప్తితో ఉన్న మనిషి ఎన్ని దారుణాలైనా చేస్తాడన్నారు. జగన్ కు సీఎం పదవి తృప్తినివ్వడంలేదని, ప్రధాని పదవి కూడా కావాలని జగన్ కు ఆశ పుట్టిందని ఆదినారాయణరెడ్డి అన్నారు.  ప్లాన్ ప్రకారమే వైఎస్ వివేకాను దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. హత్య చేసి ఆధారాలు చెరిపేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. ఈ కేసుతో సంబంధమున్న వారంతా బయటకు వస్తారన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి.. అరెస్టు చేస్తారన్న భయంతోనే ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టుకు వెళ్లారన్నారు. తప్పుచేయనప్పుడు సీబీఐ విచారణను ఎందుకు తప్పు పడుతున్నారని ప్రశ్నించారు. వివేకా హత్య కేసు దర్యాప్తు చేయాలని అమెరికా వెళ్తారా? అంటూ సెటైర్లు వేశారు. కోర్టు తీర్పులన్నీ వారికే అనుకూలంగానే రావాలా? అని ఆదినారాయణ రెడ్డి అన్నారు.   


కుట్లు వేసి కట్టు కథ అల్లారు 


"స్పాట్ లో ఉన్న అవినాష్ రెడ్డి గుండె పోటు అంటారు. ఒంటి గంట తర్వాత ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, వాళ్ల మామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అయితే... వివేకాది హత్య ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి అందరూ కలిసి చేశారని ఆరోపిస్తారు. సీఎం జగన్ అయితే ఐదు గొడ్డలి పోట్లు, దారుణంగా చంపారని చెప్పారు. అయితే ఈ విషయాలు జగన్ కు ఎవరు చెప్పారు. చేసినవాళ్లు, చేయించినవాళ్లు అందరూ మాట్లాడుకున్న తర్వాతే జగన్ ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు. పథకం మొత్తం జగన్ కు తెలుసు. అందుకే ఆ రోజు వచ్చేటప్పుడు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సజ్జలతో మాట్లాడి కథ అల్లారు. ఆ రోజు సీబీఐ దర్యాప్తు కావాలన్నారు. మరి ఈ రోజు సీబీఐ విచారణ ఎందుకు వద్దంటున్నారు. సీబీఐ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తుంది కాబట్టే హంతకులు దొరికారు. వాళ్లే హత్య చేసి... రక్తం కడిగేసి కుట్లు వేసేసి, కట్టుకథలు అల్లారు. వివేకా ఇంటి చుట్టూ కెమికల్ చల్లారంట." - ఆదినారాయణ రెడ్డి 


ఇది మహా కుట్ర 


"సీబీఐ అన్ని విషయాలు చెప్పింది. ఇంటి ముందు కుక్కను చంపారు. గొడ్డలి ఎక్కడ కొన్నారో కూడా సీబీఐ చెప్పింది. సీబీఐ భాస్కర్ రెడ్డి, ఉదయర్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో అవినాష్ రెడ్డిపై అభియోగం మోపింది. అరెస్టు చేస్తారన్న భయంతోనే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో పెద్ద కుట్ర దాగిఉంది. అందుకే సీజేఐ కేసు విచారణకు జూన్ 30 వరకు టైం ఇచ్చారు. అవినాష్ రెడ్డి అరెస్టుతో కేసు ముగిసిపోదు. ఈ కేసును సీబీఐ మహా కుట్ర అని అభియోగిస్తుంది. అంటే పెద్ద వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అందుకు మహా కుట్ర అంటున్నారు. ఒకే టైంలో సీబీఐ అన్నీ బయటకు తీస్తుంది. అప్పటి వరకూ గుప్తంగా పెడుతున్నారు."- ఆదినారాయణ రెడ్డి