Andhra Liquor Sales : ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త ఏడాది వేడుకలు జరుపుకోవాలనుకునే మందుబాబులకు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.   న్యూ ఇయర్‌ వేడుకల దృష్ట్యా వైన్స్‌, బార్లలో మద్యం విక్రయ సమయాన్ని పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ నిర్వహించే మద్యం దుకాణాల్లో విక్రయాల సమయాన్ని అర్ధరాత్రి 12 గంటల వరకు, రెస్టారంట్లు, హోటళ్లు, ఈవెంట్లు, బార్లలో రాత్రి ఒంటిగంట వరకు అనుమతి ఇచ్చింది. డిసెంబరు 31వ తేదీతో పాటు జనవరి 1న కూడా రెండ్రోజుల పాటు మద్యం విక్రయ సమయాన్ని పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదే సమయంలో కొత్త సంవత్సర వేడుకల్లో అక్రమ మద్యం, నాటుసారా విక్రయాలపై దృష్టి పెట్టాలని అబ్కారీ శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.


ఏపీలో అన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని మద్యం షాపులే 
 
ఆంధ్రప్రదేశ్ లో ఉన్నవన్నీ ప్రభుత్వ మద్యం దుకాణాలే. అన్నింటినీ ప్రభుత్వం నియమించిన కాంట్రాక్ట్ సిబ్బంది నిర్వహిస్తూంటారు. దుకాణాల సమయాన్ని రాత్రి పది గంటల వరకే నిర్దేశించారు. గతంలో రాత్రి ఎనిమిది గంటల వరకే ఉండేది. తర్వాత పెంచారు. ఇప్పుడు పది గంటల వరకూ అమ్ముతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా లిక్కర్ సేల్స్ ఎక్కువగా ఉంటాయన్న కారణంగా ప్రస్తుతం సమయాన్ని అర్థరాత్రి వరకూ పెంచినట్లుగా తెలుస్తోంది. ఒకటో తేదీన కూడా పార్టీలు చేసుకునే వారు ఉంటారని.. అందుకే.. అర్థరాత్రి వరకూ అమ్మాలని నిర్ణయించుకున్నారు. బార్లలోనూ అవే సమయాలు అమలు చేస్తారు. 


మద్యం అమ్మకాలను నియంత్రించాలనుకుంటున్న ప్రభుత్వం సమయం పెంచడంతో విమర్శలు


నిజానికి ఏపీలో ప్రభుత్వం మద్యం అమ్మకాలను నియంత్రించడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందుకే.. కొత్త ఏడాది మద్యం అమ్మకాలపై నియంత్రణ విధిస్తుందని అనుకున్నారు. అమ్మకాలు భారీగా  పెరగకుండా ప్రజల్లో అవగాహన కల్పిస్తుందని అనుకున్నారు. కానీ ప్రభుత్వం అనూహ్యంగా కాస్త ఆలస్యమైనా మందు బాబులు కంగారు పడకుండా మద్యం కొనుగోలు చేసుకునేలా సమయం పెంచడం.. చాలా మందిలో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది మద్యం అమ్మకాలను నియంత్రించడం కాదని.. ప్రోత్సహించడం కిందకు వస్తుందన్న విమర్శలు చేస్తున్నారు. 


ప్రభుత్వ తీరుపై ఇటీవల విమర్శలు చేసిన మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ మాజీ చైర్మన్ 


ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నేతృత్వంలో విజయవాడలో నిర్వహించిన అఖిలపక్ష భేటీలో నిన్నామొన్నటి వరకూ ప్రభుత్వం తరపున మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్న లక్ష్మణరెడ్డి  మద్యం విషయంలో ప్రభుత్వ తీరును విమర్శించారు. గతంలో బెల్టు షాపులే ఉండేవి కానీ ఇప్పుడు బైకుల మీద ఇంటింటికి వెళ్లి అమ్ముతున్నారని విమర్శించారు.  వచ్చే ఎన్నికలకు మద్య నిషేధం చేసే వె్ళ్తామని జగన్ చెప్పిన  మాటల్ని నమ్మానని కానీ ఆదాయం కోసం.. మద్య నిషేధ హామీని జగన్ మర్చిపోయారని విమర్శించారు. ఆయన విమర్శలకు తగ్గట్లుగానే ప్రభుత్వం ఓ వైపు దుకాణాలు పెంచుతోంది. మరో వైపు అమ్మకాల కోసం .. అనేక సడలింపులు ఇస్తోంది. దీంతో ప్రభుత్వంపై సహజంగానే విమర్శలు పెరుగుతున్నాయి.