దేశంలోని అతిపెద్ద ఎగ్జబిషన్‌లలో ఒకటైన నుమాయిష్‌కు హైదరాబాద్ సిద్దమైంది. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో రేపటి నుంచి 46 రోజులపాటు నుమాయిష్‌ను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత 82ఏళ్లగా నాంపల్లిలో నుమాయిష్ పేరుతో ప్రతి ఏటా అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్మన నిర్వహిస్తున్నారు. గత రెండేళ్లుగా కోవిడ్ ప్రభావంతోపాటు ఇతర కారణాలతో నాంపల్లిలో నుమాయిష్‌ జరపలేదు. దీంతో రెండేళ్ల విరామం తరువాత ఈఏడాది నిర్వహించబోతున్న ఎగ్జిబిషన్ ప్రత్యేకతను సంతరించుకుంది. 


జనవరి 1వ తేది సాయంత్రం నుంచి నుమాయిష్ ఎగ్జిబిషన్ ను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహ్మద్ అలి,ప్రశాంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అప్పటి నుంచి నగరంలో నుమాయిష్‌ సందడి మొదలైనట్లే. ప్రతీ రోజూ మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 10.30 వరకూ ఎగ్జిబిష్ గ్రౌండ్‌లోకి  సందర్మకులను అనుమతిస్తారు.


ఈసారి 1500 మంది ఎగ్జిబిటర్లతో 2400 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఎగ్జిబిషన్ లోపల స్టాల్స్ నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. నాంపల్లిలో జరగబోతున్న ఈ భారీ ఎగ్జిబిషన్ కు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు. దేశంలోని అనేక ప్రాంతాలు ముఖ్యంగా మహారాష్ట్ర ,జమ్మూకాశ్మీర్, పశ్చిమబెంగాల్, తమిళనాడు ఇలా ఇతర రాష్ట్రాల నుంచి స్థానిక ఉత్పత్తులను ఈ ఎగ్జిబిషన్‌లో విక్రయించేదుకు భారీగా ఎగ్జిబిటర్లు ఇక్కడకు ఇప్పటికే చేరుకున్నారు.


ఈ నుమాయిష్‌లో గుండు సూది నుంచి అధునాతన టెక్నాలజీతో ఉపయోగించే వస్తువుల వరకూ ఒకటేమిటి అన్నీ అందుబాటు ధరల‌్లో లభిస్తాయి. మధ్యాహ్నం మొదలై రాత్రి వరకూ దీపకాంతులతో దేదీప్యమానంగా వెలుగు చూపరులను ఆకట్టుకోనుంది నుమాయిష్. ఎగ్జిబిషన్ లోపలికి వెళ్లింది మొదలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ తో పాటు నోరూరించే రుచికరమైన స్దానిక వంటలతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన సాంప్రదాయ వంటలు ఇక్కడ భోజనప్రియులను ఆకట్టుకుంటాయి. అందుకే నుమాయిష్ అంటే హైదరాబాద్ వాసులకు పెద్ద పండుగ. అందులోనూ నూతన సంవత్సరం ఆరంభంలో ఏర్పాటు చేసే ఈ ఎగ్జిబిషన్ కు ఉన్న క్రేజే వేరు. కేవలం నుమాయిష్ ను చూసేందుకు, ఇక్కడ ప్రదర్మనలో వస్తువులను కొనేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి సైతం సందర్మకులు నాంపల్లి చేరుకుంటారు. 


ఈసారి నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రవేశ రుసుము 30 రూపాయల నుంచి 40 రూపాయలకు పెంచారు. గత రెండేళ్ల క్రితం కేవలం ముఫై రూపాల్లోనే నుమాష్ చుట్టురావొచ్చు. ఈసారి ఓ పదిరూపాయలు ధర అదనంగా పెంచామంటున్నారు ఎగ్జిబిషన్ నిర్వాహక కమిటీ సభ్యులు. మధ్యాహ్నం 3దాటాక ఎగ్జిబిషన్ లోపలకు సందర్మకులను అనుమతిస్తే, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ 600 రూపాయలు చెల్లించి నేరుగా కారులో లోపలికి వెళ్లి నుమాయిష్ చుట్టివచ్చే విధంగా ఈసారి అవకాశం కల్పించారు.


సందర్మకుల కోసం ఉచిత పార్కింగ్ వసతి కల్పించడంతో పాటు టాయిలెట్స్, అత్యవసర పరిస్దితిలో వైద్య సహాయం కోసం 108 వాహనంతోపాటు మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంచనున్నారు. ప్రమాద వశాస్తు అగ్ని ప్రమాదాలు సంభవిస్తే మంటలను అదుపుచేసేందుకు తగిన ఏర్పాట్లు చేసారు. దేశవ్యాప్తంగా అరుదైన ఉత్పత్తులతోపాటు ,నోరూరించే రుచులు, పిల్లలకు ఆహ్లాదాన్ని కలిగించే వినోద క్రీడలు.. ఇలా ఒకటేమిటి రేపటి(ఆదివారం) నుంచి 46రోజులపాటు జరగనున్న నాంపల్లి నుమాయిష్ నగరవాసుల్లో కొత్త జోష్ నింపనుంది.