Daggubati Venkateswara Rao visited AP CM Chandrababu | అమరావతి: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు భేటీ అయ్యారు. సుదీర్ఘకాలం తర్వాత డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన తోడల్లుడు చంద్రబాబు ఉండవల్లి నివాసానికి వెళ్లి సోమవారం వెళ్లారు. తాను రచించిన ‘ఆది నుంచి నేటి వరకు’ అనే ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి రావాలని సీఎం చంద్రబాబును తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆహ్వానించారు. రాజకీయ భేటీ కాదని, కేవలం పుస్తకావిష్కరణకు సంబంధించి చంద్రబాబును కలిసినట్లు తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు ప్రముఖులను ఈ పుస్తకావిష్కరణ కార్యాక్రమానికి దగ్గుబాటి ఆహ్వానించారు.
దగ్గుబాటి వెంకటేశ్వరావు సతీమణి దగ్గుబాటి పురందేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో ఆమె భాగస్వామిగా ఉన్నారు. పలు కార్యక్రమాలలో చంద్రబాబు, పురంధేశ్వరి కలిసి పాల్గొన్నారు. కుటుంబానికి సంబంధించిన కొన్ని ఫంక్షన్లలో చంద్రబాబు, వెంకటేశ్వరరావు కలిశారు. కానీ దాదాపు ముప్పై ఏళ్ల తరువాత చంద్రబాబు నివాసానికి వెంకటేశ్వరావు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం దగ్గుబాటి పాలిటిక్స్ లో అంతగా యాక్టివ్‌గా లేరు. ఎన్నికలకు ముందు తనయుడితో కలిసి వైసీపీలో చేరడం తెలిసిందే. కుమారుడు దగ్గుబాటి చెంచురామ్ కు ఎమ్మెల్యే సీటు కోసం గట్టిగానే ప్రయత్నించారని అప్పట్లో ప్రచారం జరిగింది.
1995 ఎపిసోడ్ తరువాత కొన్నాళ్లకు పెరిగిన దూరం..తోడల్లుళ్లు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరావుల మధ్య 1995 ఎపిసోడ్ తరువాత కాస్త పెరిగినట్లు సన్నిహితులు చెబుతుంటారు. పార్టీ, రాష్ట్ర ప్రజల క్షేమం కోసం తాను మామ ఎన్టీఆర్ నుంచి అధికారం సొంతం చేసుకోవాల్సి వచ్చిందని.. దానిపై నందమూరి కుటుంబంతో ముందుగానే చర్చించినట్లు కొన్ని నెలల కిందట బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న కార్యక్రమంలో చంద్రబాబు తెలిపారు. కానీ లక్ష్మి పార్వతి అతిజోక్యంతో అసంతృప్తిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టి చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారని తెలిసిందే. వైస్ రాయ్ హోటల్ ఘటన, అనంతరం ఎన్టీఆర్ ను గద్దె దింపిన ఎపిసోడ్ తరువాత చంద్రబాబు.. తనకు మద్దతు తెలిపిన హరికృష్ణను, వెంకటేశ్వరావును దూరం పెట్టినట్లు విమర్శలు సైతం ఉన్నాయి. దాంతో ఇన్నేళ్లుగా చంద్రబాబు నివాసానికి వెంకటేశ్వరావు వెళ్లలేదని సమాచారం. మరోవైపు దగ్గుబాటి సైతం క్రమంగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరమవుతూ వచ్చారు. దాదాపు 30 ఏళ్ల తరువాత తన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించేందుకు చంద్రబాబు నివాసానికి దగ్గుబాటి వెళ్లడం హాట్ టాపిక్ అవుతోంది.
Also Read: AP Govt Alert: ఏనుగుల దాడి ఘటన - భక్తుల భద్రతపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం