Elephants attack in Annamayya District | ఓబులవారిపాలెం: అన్నమయ్య జిల్లా ఓబులవారిపాలెం మండలం గుండాల కోనలో ఏనుగుల దాడి ఘటనతో కూటమి ప్రభుత్వం అప్రమత్తం అయింది. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో జరగనున్న ఉత్సవాల నేపథ్యంలో అడవి మార్గంలో కాలినడకన వచ్చే భక్తులకు భద్రత ఏర్పాట్లు పెంచాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. రాయలసీమ సహా అటవీ ప్రాంతాల్లోని శివాలయాల వద్ద తక్షణమే భద్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కర్ణాటక సహా పలు రాష్ట్రాల నుంచి కాలినడకన వచ్చే భక్తులకి సదుపాయాలతో పాటు వారి రక్షణ కోసం పోలీస్ శాఖ, అటవీ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని హోం మంత్రి దిశా నిర్దేశం చేశారు.
ఏనుగుల దాడిలో ముగ్గురు భక్తులు మృతి
ఓబులవారిపల్లె: అన్నమయ్య జిల్లాలో ఓబులవారిపల్లె మండలం గుండాల కోన అటవీ ప్రాంతంలో భక్తులపై ఏనుగుల గుంపు దాడి చేసిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అటవీ శాఖ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం కోసం రైల్వేకోడూడు ఆస్పత్రికి తరలించారు. శివరాత్రి సందర్భంగా వై.కోటకు చెందిన భక్తులు అటవీ ప్రాంతంలో కాలినడకన వెళ్తుండగా గుండాల కోన వద్ద వారిపై ఏనుగుల గుంపు దాడి చేసింది. 14 మందిలో ముగ్గురు భక్తులు దినేష్, చంగల్ రాయుడు, తుపాకుల మణమ్మ చనిపోయారని పోలీసులు నిర్ధారించారు.
ఏనుగుల దాడి ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి అండగా ఉంటామన్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టి, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కో ఫ్యామిలీకి రూ.10 చొప్పున, గాయపడిన బాధితులకు రూ.5 లక్షల మేర సాయం ప్రకటించారు.
మన్యం జిల్లాలోనూ ఏనుగుల బీభత్సం
పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం పెదమేరంగిలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. మంగళవారం తెల్లవారుజామున సాయి గాయత్రి రైస్ మిల్ షట్టర్లను విరగగొట్టి రైస్ మిల్లులోనికి ఏనుగుల గుంపు చొరబడింది. మిల్లులో నిల్వ చేసిన ధాన్యం, బియ్యం నిల్వలను ఏనుగుల గుంపు చెల్లాచెదురు చేసింది. నెల రోజుల్లో ఈ రైస్ మిల్లుపై దాడి జరగడం ఇది రెండోసారి. సుమారు రూ. 2 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు చెబుతున్నారు. ఏనుగుల నుంచి తమకు ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని.. తమను రక్షించాలని అధికారులను వేడుకుంటున్నారు.