Cyclone Michaung updates: ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో మిగ్‌జాం తుపాను బీభత్సం సృష్టించబోతోంది. తీరం దాటే ప్రాంతమైన దివిసీమకు భారీ ముప్పు పొంచి ఉంది. దివిసీమ ప్రజలు భయభయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. తీవ్ర రూపం దాల్చిన తుపాను నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే ఛాన్స్ ఉందని చెప్పడంతో ఓడ రేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మచిలీపట్నంలో ఏడో నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరేశారు.
నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ శిబిరాలు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను, తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలను సురక్షిత శిబిరాలకు తరలిస్తున్నారు. వారి కోసం మందులు, ఆహార ధాన్యాలు, చిన్న పిల్లలకు పాలు సిద్ధం చేశారు.
కోత కోసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మిగతా పంట నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎవరూ కోతలు చేయొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. ఇప్పటికే తుపాను ప్రభావిత జిల్లాల్లో మూడు రోజుల నుంచి భారీగా వర్షాలు పడుతున్నాయి. దీని కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 23 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదు అయింది.
తుపాను ప్రభావంతో ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఎవరూ ఎలాంటి ప్రత్యేక క్లాస్‌లు పెట్టొద్దని అధికారులు ఆదేశించారు. తుపానుపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్... ఎక్కడా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని సూచించారు. సహాయక పునరావాస కేంద్రాల విషయంలో రాజీ వద్దని అన్నారు. దీంతో రెవెన్యూ శాఖ ఐదు జీవోలు విడుదల చేసింది. ఆయా జిల్లాల కలెక్టర్లు 11 కోట్లను అత్యవసరంగా విడుదల చేసుకునే వెసులుబాటు కల్పించింది.
సహాయక చర్యల కోసం నెల్లూరులో నాలుగు , బాపట్లలో మూడో, కృష్ణాలో రెండు తిరుపతి ప్రకాశం జిల్లాలో ఒక్కో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేసి ఉంచారు. ఈ జిల్లాల్లో మొత్తంగా 192 పునరావాస కేంద్రాలు రెడీ చేశారు. ఇప్పటికే ఏడు వేల మందినీ శిబిరాలకు తరలించారు.
సహాయక శిబిరాల నుంచి బాధితులను ఇంటికి పంపే సమయంలో రెండువేల ఐదు వందల రూపాయలు ఇవ్వనున్నారు. దీంతోపాటు ఆయా కుటుంబాలకు పాతిక కేజీల బియ్య, కేజీ కందిపప్పు, ఒక లీటర్ నూనె, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు అందజేస్తారు.